తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. పవిత్రమైన ధనుర్మాసం జనవరి 14వ తేదీ ఆదివారం ముగియనుండడంతో జనవరి 15వ తేదీ సోమవారం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది.గత ఏడాది డిసెంబరు 17వ తేదీ తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికానుండటంతో.. జనవరి 15వ తేదీ నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది. అదేవిధంగా జనవరి 16వ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం.. మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరుగనున్నాయి.
శ్రీవారిని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. వీరితోపాటు సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యులు పీపీ వవా, తెలంగాణ ఎంపీ మన్నే శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఉదయం అభిషేక సేవలో టీవీఎస్ కంపెనీ ఎండీ కె.షణ్ముగం, డైరెక్టర్ సుదర్శన్ వేణు పాల్గొన్నారు. అయోధ్యలో ఈనెల 22న ప్రారంభం కానున్న శ్రీరామాలయంలో ఆదిజాంబవంతుడికి ఆలయం నిర్మించాలని అయోధ్య ట్రస్టును కోరనున్నట్లు ఏపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు.