ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ వివేకా కుమార్తె, అల్లుడి పిటిషన్.. అందుకే నో చెప్పిన హైకోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 13, 2024, 06:55 PM

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు వ్యవహారం మరోసారి ఏపీ హైకోర్టుకు చేరింది.ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు వాంగ్మూలం ఇవ్వాలని తాము బలవంతం చేసినట్లు మృతుడి పీఏ కృష్ణారెడ్డి చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ తరఫున లాయర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. కృష్ణారెడ్డి వేసిన ప్రైవేటు ఫిర్యాదుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా.. లేవా అనే విషయాలను మేజిస్ట్రేట్‌ పరిశీలించకుండానే ఆ ఫిర్యాదును పోలీసులకు సిఫార్సు చేశారన్నారు. వివేకానందరెడ్డి దగ్గర పీఏగా పనిచేయడంతో హత్య గురించి కృష్ణారెడ్డికి తెలిసి ఉంటుంది కాబట్టి వాంగ్మూలం ఇవ్వాలని మాత్రమే ఎస్పీ కోరారన్నారు.


కృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదుకు విచారణ అర్హత లేదని వాదనలు వినిపించారు. కృష్ణారెడ్డి తన ఫిర్యాదును ఎస్‌హెచ్‌వోకు ఇవ్వకుండా.. నేరుగా ఎస్పీకి ఇచ్చారని గుర్తు చేశారు. పులివెందుల పోలీసులు ఇప్పటికే దిగువ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారన్నారు.. దాన్ని కోర్టు విచారణ నిమిత్తం (కాగ్నిజెన్స్‌) పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం దాఖలు చేసిన పిటిషన్లు నిరర్థకం అవుతాయన్నారు. దిగువ కోర్టులో విచారణ ప్రక్రియను నిలువరించాలని కోరారు. ప్రభుత్వోద్యోగి (రామ్‌సింగ్‌)పై కేసు నమోదు చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి అన్నారు. రామ్‌సింగ్‌ విషయంలో అనుమతి తీసుకోలేదని..ఆయనపై కేసు నమోదుచేయడం ఇది రెండోసారి అని చెప్పారు.


తాము చెప్పినట్లు సాక్ష్యం ఇవ్వాలని పిటిషనర్లు కృష్ణారెడ్డిని ఒత్తిడి చేశారని పోలీసుల తరఫు లాయర్ వాదించారు. స్థానిక పోలీసులు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాకే కృష్ణారెడ్డి ప్రైవేటు ఫిర్యాదు వేశారన్నారు. పిటిషనర్ల కారణంగా కృష్ణారెడ్డి కుమారుడి పెళ్లి కూడా నిలిచిపోయిందని.. తప్పు చేయకపోయినా కృష్ణారెడ్డి 90 రోజులు జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉండాల్సి వచ్చిందన్నారు. వివేకా హత్యకేసులో రాజకీయ పెద్దల పేర్లు చెప్పాలని ఎస్పీ రామ్‌సింగ్‌ కృష్ణారెడ్డిని కొట్టారన్నారు. ఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏ దశలోనైనా అనుమతి పొందొచ్చని.. హత్యకేసు దర్యాప్తు నుంచి ఎస్పీ రామ్‌సింగ్‌ను సుప్రీంకోర్టు పక్కన పెట్టిందన్నారు. ఈ వాదనలపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. పీపీ చెబుతున్నట్లు కృష్ణారెడ్డి స్థానిక పోలీసులకు కాకుండా నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. ఈ విషయంలో కృష్ణారెడ్డి వాదనలు వినాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి జస్టిస్‌ బీఎస్‌ భానుమతి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృష్ణారెడ్డికి నోటీసులు జారీచేశారు.. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు.


వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి కొందరు తనను బెదిరిస్తున్నారనే ఆరోపణతో పీఏ కృష్ణారెడ్డి 2021 డిసెంబరులో పులివెందుల కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలుచేశారు. పులివెందులకు చెందిన కొందరు నేతల ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ ఒత్తిడి చేస్తున్నారన్నారు. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఒత్తిడి చేశారని ఆరోపించారు. 2023 డిసెంబరు 8న కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు విచారణ జరిపింది. కేసు నమోదు చేసి జనవరి 4న తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పులివెందుల పోలీసులు సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పులివెందుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతోపాటు పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సునీత, రాజశేఖర్‌రెడ్డి, ఎస్పీ రామ్‌సింగ్‌ హైకోర్టును ఆశ్రయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com