అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎస్టీ కాదంటూ గిరిజన సంక్షేమ శాఖ ఈ ఏడాది జనవరి 4న జారీ చేసిన జీవో 2ను హైకోర్టు ఎనిమిది వారాలు సస్పెండ్ చేసింది. ప్రతివాదులకు నోటీసులిస్తూ విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేసింది. హైకోర్టు గతేడాది డిసెంబరు 26న ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా జీవో ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తనను ఎస్టీ కాదంటూ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన జీవో2ను సవాలు చేస్తూ మాజీ ఎంపీ కొత్తపల్లి గీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది ఎస్‌ఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. డిసెంబరులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కుల వివాదంపై సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి అభ్యంతరాలు సమర్పించడానికి పిటిషనర్‌కు ఇంకా రెండు వారాలు మిగిలే ఉన్నాయని అన్నారు. అయినా ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు.. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జీవోను 8 వారాలు సస్పెండ్ చేశారు. దీంతో ఆమెకు బిగ్ రిలీఫ్ దక్కింది.