తిరుమలలో డ్రోన్ కలకలంరేపింది. భద్రతా నిబంధనలకు వ్యతిరేకంగా డ్రోన్‌ను ఎగురవేయడంపై విమర్శల వచ్చాయి. దీంతో టీటీడీ స్పందించింది.. ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చింది. టీటీడీ నిబంధనలపై అవగాహన లేని వ్యక్తి తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఎగురవేసిన తేలికపాటి ప్లాస్టిక్ డ్రోన్‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి హర్యానాకు చెందిన శ్రీ దినేష్ తేలికపాటి ప్లాస్టిక్ ఫోల్డెడ్ నానో డ్రోన్‌ను ఘాట్ రోడ్డులో 53వ మలుపు వద్ద ఎగురవేశారన్నారు. ఇది చిన్న ప్లాస్టిక్ డ్రోన్ కావడంతో అలిపిరి స్కానింగ్ పాయింట్‌లో సైతం గుర్తించడం సాధ్యం కాలేదన్నారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతుంది. టీటీడీ విజిలెన్స్ అధికారులు డ్రోన్ తోపాటు సదరు వ్యక్తిని తిరుమల పోలీసులకు అప్పగించారు. తిరుమలలో భద్రతకు సంబంధించి సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారంటోంది టీటీడీ.
భద్రతా కారణాలతో పాటుగా ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం డ్రోన్‌ను ఎగరవేయడాన్ని టీటీడీ నిషేధించింది. డ్రోన్‌తో ఎవరైనా తిరుమలకు వచ్చే ప్రయత్నం చేస్తే అలిపిరిలోనే భద్రతా సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకుంటారు. కానీ చిన్నదిగా ఉండి ప్లాస్టిక్ కావడంతో గుర్తించలేకపోయామని టీటీడీ చెబుతోంది. డ్రోన్ ఎగురవేసిన దినేష్‌ను తిరుమల పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డ్రోన్ ఎలా తీసుకువచ్చారు.. దేనికోసం తీసుకువచ్చారు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. హర్యానాకు చెందిన దినేష్ కుటుంబసభ్యులతో కలిసి కారులో తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనం తర్వాత కారులో కిందకు దిగుతూ.. 53వ మలుపు వద్ద డ్రోన్‌ను ఎగురవేసి శ్రీవారి మోకాలి మెట్టు, నడకమార్గం, అటవీ ప్రాంతాన్ని చిత్రీకరించారు. స్థానికులు గుర్తించి అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయకూడదని సూచించినా పట్టించుకోలేదు. తిరుమలకు వాహనాల్లో అలిపిరి తనిఖీ కేంద్రం మీదుగానే చేరుకోవాలి. అక్కడి భద్రతా సిబ్బంది వాహనాలు, లగేజీ స్కానింగ్‌ను చేస్తారు. తనిఖీ కేంద్రం మీదుగానే డ్రోన్‌ను తిరుమలకు తీసుకువచ్చి వినియోగించడం కలకలంరేపింది .
దినేష్ ఆర్మీలో ఎస్పీ స్థాయి అధికారిగా పనిచేస్తున్నట్లు సమాచారం కాగా.. నిబంధనలు తెలియక డ్రోన్‌ను వినియోగించానని ఆయన చెబుతున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో ఆలయం వీడియోను డ్రోన్ ద్వారా రికార్డ్ చేయడం కలకలంరేపింది.. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంపై ఆరా తీసిన టీటీడీ సిబ్బంది.. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు సంబంధించినవారు వీడియోను రికార్డ్ చేసినట్లు గుర్తించారు. ఈ వీడియోను కొన్ని టెస్టింగ్‌ల కోసం కూడా పంపారు. ఇప్పుడు మరో భక్తుడు డ్రోన్ ఎగురవేయడం కలకలంరేపింది. అంతేకాదు తిరుమలలో మరో భక్తుడు ఏకంగా ఆలయంలోకి మొబైల్ తీసుకెళ్లి రికార్డు చేయడం కూడా కలకలంరేపిన సంగతి తెలిసిందే.