తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తిరుపతి నుంచి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం బయల్దేరవలసిన విమానం రద్దు కావడంతో 26మంది ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.ప్రయాణికులు విమానాశ్రయంలోకి వెళ్ళి చెక్‌అవుట్ పూర్తి చేసుకున్న తర్వాత విమానం రద్దయినట్లు విమానయాన సంస్థ ప్రకటించినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.తమకు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని కోరగా.. శనివారం సాయంత్రంలోపు ఏర్పాటు చేస్తామని ఎయిర్‌లైన్స్ మేనేజర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే విమాన ఛార్జీలను రీఫండ్ చేయడానికి తనకు అనుమతులు లేవని చెప్పారని తెలిపారు. అప్పటి వరకు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.విమానం రద్దయిన విషయం నిజమేనన్నారు ఈ విషయంపై విమానాశ్రయ డైరెక్టర్. ఆ ప్రయాణికులను ప్రత్యామ్నాయంగా చెన్నైనుంచి విశాఖ పంపించాలని ఎయిర్‌లైన్స్ యాజమాన్యాన్ని ఆదేశించినట్లు చెప్పారు.లేని పక్షంలో ప్రయాణికులను శనివారం ఉదయం విశాఖపట్నం పంపే ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. ప్రయాణికుల్లో కొందరు తమకు ఇప్పుడే ఇక్కడి నుంచే విమానం ఏర్పాటు చేయాలని ఎయిర్‌లెన్స్ సిబ్బందిని ప్రయాణికులు నిలదీశారు. గతంలోనూ ఇలాగే జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. ఈసారి తగినంత మంది ప్రయాణికులు లేకపోవడంతో రద్దు చేశామని కొందరు చెప్పినట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు.