నాలుగేళ్ల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజుకు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున ఆయన అభిమానులు తరలిరాగా... అక్కడి నుంచి భారీ కాన్వాయ్ మధ్య భీమవరానికి చేరుకున్నారు. అభిమానులు పూలవర్షం కురిపించి, భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రఘురామ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సొంతూరు భీమవరం రావడం చాలా ఆనందంగా ఉందని, నాలుగేళ్ల అనంతరం ఇక్కడికి వచ్చానని తెలిపారు.
తనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతగానో సహకరించారని అన్నారు. మా నాన్నమ్మ చనిపోయినప్పుడు కూడా నేను ఊరు రాలేదని, ఈ విషయం తనను ఎంతగానో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దేవతలు ఎంతటి శక్తివంతులైనా దుష్టశక్తులను అంతం చేయాలంటే త్రిమూర్తులు అవసరం పడింది.. నేను అవకాశవాదిని కాదు. వైఎస్ఆర్సీపీ ఐదేళ్లు అధికారంలో ఉంటుందని నాకు తెలుసు.. కానీ, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వారి తీరు నచ్చక బయటకు వచ్చేశాను..
రాజధాని అమరావతి నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ మాట మార్చారు. అందుకే నా నిర్ణయం మార్చుకుని బయటకు వచ్చాను.. నాపై కేసులకు సంబంధించి వేసిన పిటీషన్‌పై జనవరి 25 తర్వాత సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.. నా స్థాయిలో నేను పోరాటం చేస్తున్నానని... తన తరఫున లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు’ అని ఎంపీ రఘురామ స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గానికి రాకుండా తనను ఇన్నాళ్లూ తనను ఇబ్బంది పెట్టారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ,
ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తాను ఏ పార్టీ నుంచి పోటీచేస్తాననే విషయాన్ని బయటపెట్టారు. ‘టీడీపీ, జనసేన కలిసిన రోజే కోస్తాలో వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది. ఫిబ్రవరి రెండో వారంలో ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నా.. అప్పటికి పొత్తుల అంశం ఖరారయ్యే అవకాశం ఉంది.. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తర్వాత బీజేపీతో పొత్తు విషయం తేలిపోనుంది.. మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయని భావిస్తున్నాను... టీడీపీ-జనసేన కూటమి తరఫున పోటీకి నేను సిద్ధంగా ఉన్నా’’ అని రఘురామ వెల్లడించారు.