ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమిలో భాగంగానే పోటీచేస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 14, 2024, 03:54 PM

నాలుగేళ్ల తర్వాత సొంత గడ్డమీద అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది. తెలుగుదేశం నేతలు, జనసైనికులు అందరూ ప్రేమతో చూపించిన ఆదరణను నా జీవితంలో మర్చిపోలేను. టీడీపీ, జనసేన అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాను’’ అని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వైసీపీ అధినేత, సీఎం జగన్‌తో విభేదాల వల్ల వివిధ రకాల కేసులకు గురైన రఘురామ సుమారు నాలుగేళ్ల నుంచి ఢిల్లీలో ఉండిపోయారు. కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన కోర్టు అనుమతి తీసుకుని నియోజకవర్గానికి వచ్చారు. శనివారం రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అక్కడనుంచి ఆయన నరసాపురం చేరుకున్నారు. ఆయనకు భారీ పోలీసు భద్రత కల్పించారు. వందలాది మంది వివిధ పార్టీ నేతలు, అభిమానాలు ఆయనకు స్వాగతం పలికారు. గజమాలలతో సత్కరించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సింహం జిందాబాద్‌, సింహం నాయకత్వం వర్థిల్లాలని నినాదాలు చేశారు. అనంతరం ఆయన రావులపాలెం మీదుగా పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లారు. ‘‘నన్ను జైలులో పెట్టినప్పటి నుంచి చంద్రబాబు అందించిన సహకారం, లోకేశ్‌ ఇచ్చిన మద్దతు, పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన సహకారం జీవితంలో మర్చిపోలేను. కష్టంలో ఉన్నప్పుడే మనకు మనవాళ్లెవరో, పరాయివాళ్లెవరో అర్థమవుతుంది. ఇక్కడ ఇంత ఆదరాభిమానాలతో స్వాగతం పలకడం నా జన్మ ధన్యమనిపించింది. గతంలో జరిగిన సంఘటన దురదృష్టం, కష్టకాలంలో కూడా రాలేకపోయాను. ఇవాళ కోర్టు ప్రొటక్షన్‌తో వచ్చాను. పోలీసులు కూడా బాగా సహకరిస్తున్నారు. రాబోయే రోజులన్నీ మంచివే’’ అని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com