ఏడాదిన్నర కిందట భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 3,500 కి.మీ. పాదయాత్ర చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎన్నికలకు ముందు మళ్లీ జనం బాటపట్టారు. ఆదివారం ఆయన మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. మణిపూర్‌లోని తౌబల్ జిల్లాలో ఓ ప్రైవేట్ మైదానం నుంచి యాత్రను ప్రారంభించారు. మొత్తం 67 రోజుల పాటు కొనసాగనున్న భారత్ న్యాయ్ యాత్ర 15 రాష్ట్రాల్లో 110 జిల్లాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా కాలినడకన, బస్సులో మొత్తంగా 6,700కిపైగా కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. మార్చి 20న ముంబయిలో ఈ యాత్ర ముగుస్తుంది.
మణిపూర్, నాగాలాండ్ మీదుగా జనవరి 18 నాటికి ఈ యాత్ర అసోంకి చేరుకుంటుంది. ఆదివారం రాత్రికి మణిపూర్ సరిహద్దులోని ఖుజామా గ్రామంలో రాహుల్ బస చేయనున్నారు. సోమవారం ఉదయం అక్కడి నుంచి నాగాలాండ్‌లోకి ప్రవేశించి.. ఆ రాష్ట్ర రాజధాని కోహిమాలో భారీ ర్యాలీని చేపడతారు. ఇది ఎన్నికల కోసం చేస్తున్న యాత్ర కాదని ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టం చేసింది. దేశంలో వెనుకబడిన వర్గాలు గొంతుకను వినిపించేందుకే రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపడుతున్నట్టు తేల్చి చెప్పింది. అందరికీ న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించింది. మణిపూర్‌లోని జరిగిన జోడో న్యాయ్ యాత్ర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. పొగమంచు కారణంగా హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ఇబ్బంది ఎదురవ్వడంతో యాత్ర ఆరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక, జోడో యాత్ర గీతాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల కిందట విడుదల చేసిన విషయం తెలిసిందే.