సంక్రాంతి పండుగ వేళ ఉల్లాసంగా ఎగరేసే పతంగులు కొన్ని కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. పతంగుల కోసం ఉపయోగించే చైనా మాంజా (Chinese Manja) ప్రాణాంతకంగా మారింది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో పతంగి ధారం.. ఓ చిన్నారి మెడ కోసింది. సోమవారం (జనవరి 15) మధ్యాహ్నం తండ్రితో కలిసి పాండురంగపురం జంక్షన్ వైపు బీచిని సందర్శించడానికి వచ్చింది ఏడేళ్ల చిన్నారి నెల్లి ప్రణీత. బీచ్‌లో గాలిపటాలు ఎగరేస్తున్న ధారం.. పాప మెడకు తగిలి గాయమైంది. తీవ్ర రక్తస్రావమై తల్లడిల్లుతున్న చిన్నారిని ఆమె తండ్రి శ్రీనివాస్.. ఆటోలో హుటాహుటిన విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు. వైద్యులు వెంటనే ఆమెకు సర్జరీ నిర్వహించారు.
చిన్నారి ప్రణీత తన తల్లిదండ్రులతో కలిసి బర్మా క్యాంపు కంచరపాలెం వద్ద ఏఎస్‌ఆర్ నగర్‌లో నివసిస్తోంది. స్థానిక సూర్యోదయ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతోంది. పాప ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. పిల్లల వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో పాపకు చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు. మెడ వద్ద తక్కువగానే కట్ అవ్వడంతో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడిందని తెలిపారు.
పెద్ద వాల్తేరుకు చెందిన ఆర్మీ జవాన్ మృతి
హైదరాబాద్‌లోని లంగర్ హౌస్‌లో పతంగి ధారం మెడను కోసేయడంతో ఆర్మీ జవాన్ కాగితాల కోటేశ్వర్ రెడ్డి (30) మృత్యువాతపడ్డారు. కోటేశ్వర్ రెడ్డి స్వస్థలం విశాఖపట్నం జిల్లా పెద్ద వాల్తేరు. లంగర్ హౌజ్‌లో మిలిటరీ హాస్పిటల్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న ‘ఆర్మీ నాయక్’ కోటేశ్వర్ రెడ్డి తన భార్యతో కలిసి బాపూ నగర్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం (జనవరి 13) విధులు ముగించుకొని వెళ్తుండగా.. లంగర్ హౌస్ వంతెనపై పతంగి ధారం కోటేశ్వర్ రెడ్డి మెడకు చుట్టుకొని కోసేసింది. తీవ్ర రక్తస్రావమైన కోటేశ్వర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
చైనా మాంజాల వాడకంపై రాష్ట్ర ప్రభుత్వం 2016లోనే నిషేధం విధించింది. నిషేదాజ్ఞలు ఉన్నా.. అక్రమంగా వీటిని అమ్ముతున్నారు. పతంగుల కోసం చాలా మంది కొంటున్నారు. చైనా మాంజాలు, గ్లాస్ కోటెడ్ పతంగి ధారాలను బ్యాన్ చేయాలని పర్యావరణవేత్తలు సైతం డిమాండ్ చేస్తున్నారు. వీటి కారణంగా ఏటా వందలాది పశుపక్ష్యాదులు మృత్యువాతపడుతున్నాయి. పతంగులను ఎగురవేసే క్రమంలో చిన్నారులు మృతి చెందుతున్నారు. తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటికే 10 మంది మరణించారు. పతంగులు ఎగురవేసే క్రమంలో భవనాలపై నుంచి జారిపడి, కరెంటు తీగలకు చిక్కుకున్న పతంగులను తీసుకునే క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై చిన్నారులు మృత్యువాతపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa