ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా వైఎస్ షర్మిలా రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరుతో మంగళవారం (జనవరి 16) మధ్యాహ్నం లేఖ విడుదలైంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ తెలిపింది. ఇప్పటివరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలు అందించిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల నియామకంతో.. ఎన్నికల ముందర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా, వైఎస్ జగన్ సోదరిగా వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌లో 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం విశేషంగా కృషి చేశారు. ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే, ఆ తర్వాత సోదరుడు జగన్‌తో ఆమెకు బేదాభిప్రాయాలు రావడంతో.. తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. అనూహ్యంగా 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ విజయం కోసం పనిచేశారు.
వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన షర్మిల.. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరినప్పుడే ఏపీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. ఆ వార్తలను నిజం చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలను వైఎస్ షర్మిలకు కట్టబెడుతూ ప్రకటన విడుదల చేసింది. కిందటిసారి ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం కోసం పనిచేసిన వైఎస్ షర్మిల.. నేడు ప్రతిపక్ష పార్టీ అధ్యక్షురాలిగా నియమితులవడంతో, ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలు రసకందాయంలో పడినట్లైంది