విజయవాడ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ప్రపంచంలోకెల్లా ఇదే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహమని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా.. పెడస్టల్ (విగ్రహం బేస్) ఎత్తు 85 అడుగులు. ఈ రెండింటిని కలిపితే మొత్తం విగ్రహం ఎత్తు 210 అడుగులు ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌గా ఈ విగ్రహాన్ని పిలవనున్నారు. స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహంతోపాటు సుమారు 19 ఎకరాల్లో స్మృతివనాన్ని సైతం ఏర్పాటు చేశారు. స్మృతివనంలో అంబేద్కర్ ఫొటో గ్యాలరీతోపాటు ఆయన జీవిత విశేషాలు, శిల్పాలను ఏర్పాటు చేశారు. కన్వెన్షన్ హాల్, ఫుడ్ కోర్టులను సైతం ఇందులో ఉంటాయి. ఇది అతిపెద్ద పర్యాటక ప్రాంతం అవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
విగ్రహం బేస్ కింది భాగంలో మొత్తం మూడు ఫ్లోర్లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక్కోటి 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో.. నాలుగు హాళ్లను ఏర్పాటు చేశారు. ఈ నాలుగింటిలో ఒకటి సినిమా హాలు కాగా.. మిగతా మూడింట్లో అంబేద్కర్ చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది. ఇక ఫస్ట్ ఫ్లోర్‌లో నాలుగు హాళ్లు, సెకండ్ ఫ్లోర్‌లో నాలుగు హాళ్లు ఉంటాయి. ఈ విగ్రహం తయారీతోపాటు స్మృతివనం ఏర్పాటు కోసం దాదాపు రూ.400 కోట్లు ఖర్చు అయ్యాయి. అయితే హైదరాబాద్‌లోనూ గత ఏడాది ఏప్రిల్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని నాటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. 125 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.146 కోట్లు ఖర్చు చేసింది. ట్యాంక్ బండ్ ఎదురుగా కొలువుదీరిన అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా.. బేస్‌మెంట్ ఎత్తు 50 అడుగులు. ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన 11.4 ఎకరాల విస్తీర్ణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం బేస్‌మెంట్‌లోనూ మ్యూజియం, లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని రూ.150 కోట్లలోపే ఏర్పాటు చేసినప్పుడు.. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రూ.400 కోట్ల ఎందుకు ఖర్చయ్యిందని ప్రతిపక్ష టీడీపీ ప్రశ్నిస్తోంది. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టును టీడీపీ దళిత నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం హయాంలోనే రూ.137 కోట్లతో స్మృతివనం ఏర్పాటు పనులు ప్రారంభించామని.. అప్పుడే 26 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. అంబేద్కర్ విగ్రహం పేరిట దోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు.