వైసీపీ ఎంపీ మార్గాని భరత్ వై.ఎస్.షర్మిళను ఉద్దేశించి కీలక సూచన చేశారు. ఇదిలావుంటే టీడీపీ - జనసేన పార్టీల మేనిఫెస్టోను అమలు చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు అవసరమని... అంత సంపద ఎలా సృష్టిస్తారని రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. సెంట్రల్ జైలు నుంచి ష్యూరిటీపై బయటకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు... ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కుమారుడు నారా లోకేశ్ భవిష్యత్తుకు గ్యారెంటీ కోసమే చంద్రబాబు కొత్త కుట్రలకు తెర లేపారని విమర్శించారు. 2014లో ప్రకటించిన టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మేనిఫెస్టోను టీడీపీ వెబ్ సైట్ నుంచి కూడా తొలగించారని చెప్పారు.
యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ ని చూసి యావత్ దేశం ఆశ్చర్యపోయిందని భరత్ అన్నారు. ఏపీకి కాంగ్రెస్ ఎంతో అన్యాయం చేసిందని... ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధుల్లో అన్యాయం చేసిందని... అలాంటి పార్టీలో చేరడంపై వైఎస్ షర్మిల మరోసారి ఆలోచించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ... రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు.