అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్య ఉత్సవాల్లో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న రామ్ లల్లా విగ్రహాన్ని నేడు మందిరంలోకి తీసుకున్నారు. రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకురానున్నట్లు ఆలయ ట్రస్ట్ పేర్కొంది. అయితే కర్ణాటక శిల్పి చెక్కిన రాముడి విగ్రహం అయోధ్యలో కొలువుదీరనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ట్రస్ట్.. ఆ ఫోటోను మాత్రం ఇంకా విడుదల చేయలేదు.
మంగళవారం నుంచే అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన క్రతువులు మొదలయ్యాయి. ఇక ఇవాళ (బుధవారం) రామ్‌లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకోనుంది. అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఆహ్వాన పత్రికలపై బాలరాముడి రూపాన్ని ముద్రించారు. మరోవైపు.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఇటీవల సీతారామ, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్న ఓ ఫోటోను ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. అదే విగ్రహాన్ని అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు.. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని అయోధ్య గర్భగుడిలో పెట్టేందుకు ఎంపిక చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. అయితే ఆ బాలరాముడి చిత్రాన్ని మాత్రం ఆలయ ట్రస్టు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. అయిదేళ్ల వయసున్న బాలరాముడు నిలబడి ఉన్న రూపంలో విగ్రహం ఉంటుందని మాత్రమే తెలిపారు.
ఇక అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దేశ, విదేశాల నుంచి అతిథులు హాజరు కానున్నారు. 50 దేశాల నుంచి 53 మంది ప్రత్యేక అతిథులుగా వస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఇక దేశంలోని రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాల్లోని ప్రముఖులతోపాటు స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు సహా మొత్తం 11 వేల మందికి ఆహ్వానాలు పంపించినట్లు తెలిపారు. ఇక వారికి ప్రత్యేక బహుమతిని అందించేందుకు కూడా ఆలయ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 22 వ తేదీన ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యే అతిథులకు రెండు గిఫ్ట్‌లు అందించనుండగా.. అందులో ఒకటి దేశీ నెయ్యితో తయారు చేసిన మోతీచూర్ లడ్డూ కాగా.. మరొకటి అయోధ్య రామ మందిర నిర్మాణ సమయంలో తీసిన పునాది మట్టిని కలిపి ఇవ్వనున్నారు. ఆ రెండింటిని కలిపి ఇచ్చేందుకు ప్రత్యేకమైన బ్యాగును కూడా తయారు చేయించారు.