పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఏ వస్తువు కొనలేక ఆకలితో అలమటిస్తున్నారు. ఓ వైపు దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత, పూర్తిగా అడుగంటిపోయిన విదేశీ మారక నిల్వలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థికంగా పాతాళానికి పడిపోయిన పాకిస్థాన్.. పూట గడవడానికి ప్రపంచ సంస్థలు, వివిధ దేశాల ముందు బిచ్చమెత్తుకుంటోంది. దీంతో పాక్‌లో నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇక అధికారులు, ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోవడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇప్పటికే పాకిస్థాన్‌లో డజను కోడి గుడ్ల ధర రూ.400 దాటింది. అంటే ఒక్కో గుడ్డు కొనుగోలు చేసేందుకు పాక్ వాసులు రూ.33 పైగా చెల్లిస్తున్నారు. ఇక ఉల్లి గడ్డ అక్కడి ప్రజలకు కొనేటపుడే కన్నీళ్లు తెప్పిస్తోంది. ప్రస్తుతం కిలో ఉల్లి గడ్డ పాకిస్థాన్‌లో రూ.250 పలుకుతోంది. ఇక చికెన్ ధర కిలో రూ.615 పలుకుతూ మరింత పైపైకి ఎగబాకుతోంది. అయితే నిత్యావసర వస్తువల ధరల జాబితాను స్థానిక యంత్రాంగం సరిగ్గా అమలు చేయకపోవడం కారణంగానే ధరలు అమాంతం పెరుగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం కిలో ఉల్లి గడ్డ ధరను రూ.175గా నిర్ణయించింది. ఇక కొన్ని మార్కెట్లలో కిలో ఉల్లి రూ.230 నుంచి రూ.250 వరకు అమ్ముతున్నారు.
పాకిస్తాన్‌లో వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించాలని అక్కడి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది సందిగ్ధంలో పడింది. తీవ్రమైన చలి కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని అక్కడి పార్లమెంటు తీర్మానించింది. అయితే ఈ తీర్మానం చేసిన సమయంలో పాక్ జాతీయ అసెంబ్లీలో అతి తక్కువ మంది సభ్యులు మాత్రమే ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ముందు పాకిస్థాన్ ప్రజలను ద్రవ్యోల్బణం పెరుగుదల చాలా ఇబ్బంది పెడుతోంది. దీంతో ఈ ఎన్నికల ఫలితాలను ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావితం చేస్తుందని అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ప్రస్తుతం పాక్‌లో అధికారంలో ఉన్న కూటమి ఓటమిని చవిచూడాల్సి వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గతేడాది నవంబర్ చివరి నాటికి పాకిస్థాన్‌పై మొత్తం రుణభారం రూ.63,399 లక్షల కోట్లకు పెరిగినట్లు తెలుస్తోంది. ఆ కేబినెట్ కమిటీ సమావేశానికి ఆర్థిక, రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల తాత్కాలిక సమాఖ్య మంత్రి శంషాద్ అక్తర్ అధ్యక్షత వహించినట్లు తెలిపారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కాస్త ఊరట కల్పించే వార్త చెప్పింది. పాకిస్థాన్‌కు సుమారు 700 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 5819 కోట్ల సాయం అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ ఇచ్చిన మొత్తం రుణం విలువ 1.9 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.16 వేల కోట్లు ఉంటుందని పాక్ వార్తా సంస్థ జిన్హువా నివేదిక తెలిపింది.