బెజవాడలో పైన అమ్మవారు.. కింద కమ్మవారు అంటూ దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో అల్లు అర్జున్‌తో డైరెక్టర్ హరీశ్ శంకర్ ఓ డైలాగ్ చెప్పిస్తారు. ఇంద్రకీలాద్రీపై కొలువై ఉన్న కనక దుర్గమ్మ ఎంతో పవర్‌ఫుల్.. అలాగే కమ్మ సామాజికవర్గం ప్రభావం కూడా విజయవాడపై ఎంతో ఉందని డైరెక్టర్ చెప్పకనే చెప్పారు. అయితే ఇక నుంచి విజయవాడ అంటే పైన అమ్మవారు.. కింద బాబా సాహెబ్ వారు అని చెప్పుకోవాలేమో.
సామాజిక న్యాయ మహాశిల్పంగా.. ప్రపంచంలోకెల్లా ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేయడమే దీనికి కారణం. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి మనం విన్నాం.. ఇక నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇండియాలో విజయవాడ పేరు మార్మోగుతుందన్నారు. తమ ప్రభుత్వం అనుసరించిన సామాజిక న్యాయానికి నిదర్శనంగా అంబేద్కర్ విగ్రహం ఎప్పుడూ విజయవాడలో కనిపిస్తుందన్నారు. అంబేద్కర్ విగ్రహం విజయవాడకు స్పెషల్ అట్రాక్షన్‌గా మారుతుందని జగన్ సర్కారు ఆశాభావంతో ఉంది.
వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన.. మరణం లేని మహనీయుడు విగ్రహం ఇదంటూ బాబాసాహెబ్ అంబేద్కర్‌పై సీఎం జగన్ ప్రశంసలు గుప్పించారు. ఈ దేశంలో పెత్తందారి తనం మీద, అంటరాని తనం మీద, కుల అహంకార దుర్మార్గం మీద, వివక్ష మీద పోరాటానికి అంబేద్కర్ నిరంతరం స్ఫూర్తినిస్తారన్నారు. అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద పోరాటం చేసిన వ్యక్తిగా అంబేద్కర్ గుర్తుండిపోతారన్నారు. సమసమాజ భావాలకు నిలువెత్తు రూపంగా అంబేద్కర్ ఎప్పుడూ మనందరికీ కనిపిస్తారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకు కూడా వివక్ష ఇంకా ఉందన్న జగన్.. అంటరానితనం రూపం మార్చుకుందన్నారు. అంటరానితనం అంటే ముట్టుకోకుండా దూరం పెట్టడం మాత్రమే కాదు.. పేదలు చదువుకునే ప్రభుత్వ బడిని పాడుబెట్టడం కూడా అంటరానితనమే అంటూ జగన్ వ్యాఖ్యానించారు. డబ్బులున్న వారికి ఒక మీడియం.. పేద పిల్లలకు మరో మీడియం అని వాదించడం కూడా అంటరానితమేనన్నారు. పెత్తందారులు, అహంకారులు అని తన ప్రత్యర్థి వర్గాన్ని విమర్శించడం ద్వారా అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలోనూ జగన్ తన వైఖరేంటో స్పష్టం చేశారు. మన దళితులు, మన ఎస్టీలు, మన బహుజనులు అనడం ద్వారా ఆ వర్గాలకు చెందిన వారిని తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించారు. పేదలకు చోటు లేని రియల్ ఎస్టేట్ రాజధానిగా అమరావతిని జగన్ అభివర్ణించారు.
‘అభివృద్ధికి, అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ భావజాలం. ఇలాంటి భావజాలం మన పెత్తందారులకు నచ్చదు. పెత్తందారులంటే మీ అందరికీ ఇప్పటికే బాగా అర్థమై ఉంటుందనకుంటున్నా. దళితులకు ఇంటి నిర్మాణానికి చంద్రబాబు సెంటు భూమి ఇచ్చింది లేదు.. అంబేద్కర్ విగ్రహం నిర్మించింది అంతకంటే లేదు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద చంద్రబాబుకు ఏకోశానా ప్రేమ లేదు. ఎస్సీగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని సీఎం హోదాలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకున్నారు. బీసీల తోకలు కత్తిరిస్తా అన్నారు’ అంటూ టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పించిన జగన్.. తమ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టిందని.. అందులో 20 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంకల్పించిందన్నారు. మంత్రివర్గంతోపాటు రాజకీయ పదవుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు ప్రాధాన్యం కల్పించామని జగన్ తెలిపారు.
ఎప్పటిలాగే ఈ సభలోనూ జగన్ చెప్పింది ఒక్కటే. తన ప్రత్యర్థులు పెత్తందారులు.. తాను పేదల పక్షపాతినని. జగన్ మాటల సంగతి అలా ఉంచితే.. విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన జగన్.. ఆ సోకాల్డ్ ‘పెత్తందారుల’పై సమర శంఖారావం పూరించారు. సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించామన్న జగన్.. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఏర్పాటుతో బెజవాడ నడిబొడ్డున ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్టే..!