ముఖ్యమంత్రి జగన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మరో 81 రోజులే అధికారంలో ఉంటారని, ఆ తరువాత రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పారు. వైసీపీ పని అయిపోయిందని, అన్ని సర్వేలు జగన్‌కు వ్యతిరేకంగా వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఈసారి టీడీపీ, జనసేన కూటమికి ఓటు వేస్తామని చెబుతున్నారని, రానున్న ఎన్నికల్లో ఈ కాంబినేషన్ సూపర్‌హిట్‌గా నిలుస్తుందని, 100 రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన రా కదలిరా బహిరంగసభల్లో ఆయన ప్రసంగించారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు ఓటేస్తే మునిగిపోతారని హెచ్చరించారు. రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని ధ్వజమెత్తారు. తమ హయాంలో 72 శాతం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని, ఈ ప్రభుత్వం మిగిలిన పనులు చేపట్టకపోవడంతో వరదలకు డయాఫ్రమ్ వాల్, కాఫర్‌డ్యామ్ దెబ్బతిన్నాయని విమర్శించారు.