విజయనగరం జిల్లా, పార్వతీపురం మండలం ఓ గ్రామానికి చెందిన బాధితురాలు అదే గ్రామానికి చెందిన పిరిడి పోలి అనే వ్యక్తి తనను నమ్మించి మోసం చేశాడని, నిలదీస్తే కులం పేరుతో దూషించాడని 2019లో పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సదరు బాధితురాలికి ఓ వ్యక్తితో వివాహం కాగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత భర్తతో విభేదాలు రావడంతో తల్లితండ్రుల ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో గంగాపురం గ్రామానికి చెందిన పిరిడి పోలి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పిరిడి పోలి పెళ్లి చేసుకుంటానంటే నమ్మి మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి చేసుకోవాలని బాధితురాలు అడగ్గా తక్కువ కులానికి చెందిన దానివంటూ కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపింది. ఆమె ఫిర్యాదుతో దీనిపై కేసు నమోదవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి విచారించారు. నేరం రుజువు కావడంతో నిందితుడు పిరిడి పోలికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ విజయనగరం కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు.