అరకు ప్రాంతంలో పండించే కాఫీకి బ్రాండింగ్ చేసింది తానేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రపంచం మొత్తం దీనిని బ్రాండింగ్ చేస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అరకు కాఫీని ప్రమోట్ చేస్తే.. వైసీపీ సర్కారు గంజాయిని ప్రమోట్ చేసిందని విమర్శించారు. గత ఎన్నికల్లో జగన్‌ను నమ్మి ఓటేస్తే ఆయన గిరిజనుల గొంతు కోశారని ఆరోపించారు. గిరిజనులకు ఒక్క మంచి పని అయినా చేశారా? అని ప్రశ్నించారు. గిరిజనులకు చెందిన మొత్తం 16 పథకాలు రద్దు చేశారని ఆరోపించారు. విశాఖలో రుషికొండకు బోడిగుండు చేసిన జగన్‌కు మరోసారి అధికారం ఇస్తే అరకు కొండలకు కూడా గుండు కొట్టిస్తారని హెచ్చరించారు. అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి నిధులు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు.