సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం వెల్లడించారు. జనసేన పార్టీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఆదివారం అనకాపల్లిలో తన అభిమానులు, మద్దతుదారులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కొణతాల ఈ విషయం తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ఉందని, రాజీలేని పోరాటం చేసే వ్యక్తి ఆయనని అన్నారు. రాష్ట్రంలో అరాచకపాలన అంతమొందించాల్సి అవసరం ఉందని మాజీ మంత్రి ఉద్ఘాటించారు.
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్‌తో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ సమయంలో వివిధ అంశాలపై వారిద్దరూ ప్రత్యేకంగా సమాలోచనలు చేశారు. అంతేకాదు, అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని, వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మంచి అనుబంధం ఉందన్నారు. కాంగ్రెస్‌లో ఉంటే ఉద్యమం చేయచ్చు కానీ, ఆ పార్టీ ఇప్పట్లో అధికారంలోకి రాకపోవచ్చని తెలిపారు.
‘పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడే వ్యక్తి.. ఎటువంటి ఎజెండా లేని వ్యక్తి.. అందుకే పవన్, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయి.. ఆయన వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేయాలి అనుకుంటున్నా.. ఆయనకు చిత్త శుద్ధి ఉంది.. ఏపీని అభివృద్ధి చేయాలి.. నిధులు రావాలి.. రైల్వే జోన్, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలు, ఇలా ఎన్నో అంశాలు చర్చించాం.. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఒక్కటే నినాదం వినిపిస్తుంది’ అని కొణతాల ప్రకటించారు.
ఇక, రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ను వీడిన వైఎస్ఆర్సీపీలో చేరిన కొణతాల.. 2014లో ఆ పార్టీ రాజీనామా చేశారు. దాదాపు పదేళ్లుగా ఆయన ఏ పార్టీలోనూ అధికారికంగా చేరలేదు. తాజాగా జనసేనలో చేరికపై స్పష్టత ఇచ్చారు. మరోవైపు, కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరాలన్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఇది హర్షణీయమని ఓ ప్రకటనలో తెలిపారు. ‘ప్రజా జీవితంలో ఉన్న ఆయన జనసేనలోకి రావడం శుభ పరిణామం. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.. ఆయన క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ధి గురించి స్పష్టత కలిగిన నాయకుడు.. పార్టీ శ్రేణులు, నాయకులు ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసేందుకు, పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు కొణతాల రామకృష్ణ సేవలు దోహదపడతాయి’ అని పేర్కొన్నారు.