తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ అదే ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల రెడ్డి చేరిక కాంగ్రెస్ ఆశలు చిగురించినట్టే కనిపిస్తున్నాయి. తాజాగా, మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన కొద్దిసేపటికే ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. ఆర్కేకు వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాగా, వైఎస్ షర్మిలతోనే తన ప్రయాణమని కొద్ది రోజుల కిందటే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ గూటికి వెళ్లే మొదటి ఎమ్మెల్యేను తానేనని ఆయన వెల్లడించారు. చెప్పినట్లుగానే ఆర్కే ఆదివారం హస్తం గూటికి చేరుకున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, షర్మిల, ఆధిష్ఠానం సూచనల మేరకు నడుచుకుంటానని ఆయన స్పష్టం చేశారు. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌లో చేరుతున్నానని, ఆమెతో పాటు రాజకీయాల్లో కొనసాగుతానని వెల్లడించారు.
రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు, సీఎం జగన్ చేసిన తప్పులను షర్మిలకు వివరిస్తానని ఆర్కే చెప్పారు. షర్మిల నాయకత్వంలో తాను ఏపీ ప్రజల కోసం పోరాటం చేస్తానని ఉద్ఘాటించారు. ఇక, 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. 2019లో రెండోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ నేత నారా లోకేశ్‌ను ఆర్కే ఓడించారు. రెండోసారి గెలిచిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డిలో అసంతృప్తి పెరిగింది. మంత్రి పదవి ఆశించినా సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కలేదు.