ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలా రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఏఐసీసీ ఇచ్చిన నియామక పత్రాన్ని గిడుగు రుద్రరాజు, రఘువీరా రెడ్డిలు ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా షర్మిలా మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పీసీసీ చీఫ్‌గా నియమించినందుకు కాంగ్రెస్ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబులపై ఆమె విమర్శలు గుప్పించారు. బీజేపీతో దోస్తీ కోసం టీడీపీ-వైఎస్ఆర్సీపీలు పోలవరాన్ని తాకట్టుపెట్టాయని విమర్శించారు.
టీడీపీ-వైఎస్ఆర్సీపీ దొందూ దొందేనని షర్మిల దుయ్యబట్టారు. బీజేపీకి సహకరిస్తున్న ఆ రెండు పార్టీలకు ఎందుకు ఓటేయ్యాలని నిలదీశారు. ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదని, పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. ఏపీపై రూ.10 లక్షల కోట్లకుపైగా అప్పుల భారం ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడిన జగన్.. సీఎం అయిన తర్వాత ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి పోరాడారా?. అని ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి ఒక్క మెట్రో కూడా తేలేకపోయారు. కనీసం పదేళ్లలో పది పెద్ద పరిశ్రమలైనా రాలేదు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను వైఎస్ఆర్సీపీ తాకట్టుపెట్టింది. సమయానికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రాఫిక్స్‌లో చంద్రబాబు రాజధానిని చూపెట్టారని అన్నారు. జగన్ మూడు రాజధానులు అన్నారని, ఒక్కటైనా కట్టారా? అని అని షర్మిల ప్రశ్నించారు. ఆయన సీఎం అయ్యాక రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు.
‘మణిపూర్ అల్లర్లు జరుగుతుంటే టీడీపీ - వైఎస్ఆర్సీపీలు బీజేపీకి భయపడి ఒక్కరోజు కూడా నోరు మెదపలేదు.. మనుషులు చచ్చిపోతుంటే నోరువిప్పలేని వాళ్లు మనుషులేనా?.. గత ఐదేళ్లలో టీడీపీ - వైఎస్ఆర్సీ పార్టీలు బీజేపీ ముందు గంగిరెద్దుల్లా తల ఊపడం తప్పితే రాష్ట్ర హక్కుల కోసం మోదీ ప్రభుత్వాన్ని నీలాదీశారా? బీజేపీకి తెలిసింది ఒకటే మతాల మధ్య చిచ్చు పెట్టాలి - ఆ మంటల్లో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ సిద్ధాంతం’ అని షర్మిల విరుచుకుపడ్డారు. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా.. మైనింగ్ మాఫియా.. ఎటుచూసినా దోచుకోవడం దాచుకోవడం ఇదీ రాష్ట్రంలో పరిస్థితి అని మండిపడ్డారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లకు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల అక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అదీ ఏపీకి కూడా వచ్చుంటే ఎన్నో పరిశ్రమలు వచ్చి, ప్రజలకు ఉపాధి కలిగేదన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకురాదన్న జగన్ రెడ్డి.. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు.