ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్యలో త్వరలోనే మసీదు శంకుస్థాపన.. విరాళాలకు వెబ్‌సైట్ ఏర్పాటు చేయనున్న ముస్లిం సంస్థ

national |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2024, 08:33 PM

500 ఏళ్ల పాటు కొనసాగిన రామ జన్మభూమి వివాదం.. 2019 లో సుప్రీం కోర్టు తీర్పుతో ముగిసింది. వివాదం ఉన్న 2.77 ఎకరాల భూమి రాముడి జన్మస్థలంగా గుర్తించిన సుప్రీంకోర్టు.. ఆ ప్రాంతంలో రాముడికి మందిరాన్ని కట్టాలని ఆదేశిస్తూ ఆ భూమిని హిందూ సంస్థలకు అప్పగించింది. ఈ క్రమంలోనే అయోధ్యలో ముస్లింలకు మసీదు నిర్మించుకునేందుకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం స్థానిక ప్రభుత్వం ముస్లిం సంస్థలకు 5 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి 2020 లో శంకుస్థాపన జరిగి.. ప్రస్తుతం ప్రారంభోత్సవం జరుపుకుంది. కానీ ముస్లింలకు మసీదు కోసం ఇచ్చిన స్థలంలో మాత్రం ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు సరికదా.. కనీసం శంకుస్థాపన చేయలేదు.


ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేళ.. ముస్లిం సంస్థ కీలక ప్రకటన చేసింది. తొందరలోనే అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు మే నెల నుంచి అయోధ్యలో గ్రాండ్ మసీదు నిర్మాణం ప్రారంభం అవుతుందని.. మసీదు ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) డెవలప్‌మెంట్ కమిటీ హెడ్ హాజీ అరాఫత్ షేక్ వెల్లడించారు. ఆ మసీదు నిర్మాణం పూర్తి చేయడానికి 3 నుంచి 4 సంవత్సరాలు పట్టవచ్చని ఆయన అంచనా వేశారు.


అయితే అయోధ్యలో మసీదు నిర్మించేందుకు డబ్బును సేకరించేందుకు క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయోధ్యలో నిర్మించనున్న మసీదుకు మహమ్మద్ ప్రవక్త పేరు మీద మసీదు ముహమ్మద్ బిన్ అబ్దుల్లా అని పేరు పెట్టనున్నట్లు హాజీ అరాఫత్ షేక్ స్పష్టం చేశారు. ప్రజల మధ్య శత్రుత్వం, ద్వేషం తొలగించి.. ఒకరిపై ఒకరు ప్రేమను పంచుకునేలా మార్చడమే తమ ప్రయత్నమని వెల్లడించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా.. ప్రజలకు, భవిష్యత్ తరాలకు మంచి విషయాలు నేర్పితే ఈ వివాదాలన్నీ సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


మరోవైపు.. మసీదు నిర్మాణంలో ఆలస్యమవుతోందని.. ఐఐసీఎఫ్ సెక్రటరీ అథర్ హుస్సేన్ తెలిపారు. మసీదు డిజైన్‌లో మరిన్ని సంప్రదాయ అంశాలను జోడించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఎన్నో దశాబ్దాల నుంచి కోర్టుల్లో నలుగుతున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై 2019 లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల భూమిని హిందూ పక్షానికి అప్పగించాలని ఆదేశించింది. వివాదాస్పద స్థలంలో రాముడికి ఆలయాన్ని నిర్మించాలని.. ఇక ముస్లింలు మసీదు నిర్మించుకునేందుకు భూమిని ఇవ్వాలని కోర్టు యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa