అయోధ్యలో మహత్తరమైన ప్రాణ ప్రతిష్ఠ క్రతువును ముగించుకొని ఢిల్లీకి చేరుకున్న వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ (Pradhanmantri Suryodaya Yojana) పేరుతో ప్రకటించిన ఈ పథకం ద్వారా దేశంలో కోటి ఇళ్లలో సోలార్ విద్యుత్ వెలుగులు నింపనున్నట్లు తెలిపారు. సూర్యవంశీయుడైన శ్రీరాముడి దివ్య ఆశీస్సులతో.. కోటి మంది ఇళ్ల పైకప్పుపై సోలార్ విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామని సోమవారం (జనవరి 22) సాయంత్రం ప్రధాని మోదీ ప్రకటించారు. అయోధ్య నుంచి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్న వెంటనే.. PSY పథకంపై మంత్రులు, అధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ఇళ్లపై అమర్చనున్న సోలార్ ప్యానెళ్ల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
‘సూర్యవంశీయుడైన భగవంతుడు శ్రీరాముని కాంతి నుంచి ప్రపంచలోని భక్తులందరూ ఎల్లప్పుడూ శక్తిని పొందుతారు. ఈ రోజు అయోధ్యలో పవిత్రమైన ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా.. దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సొంత సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థను కలిగి ఉండాలనే నిర్ణయం తీసుకున్నాం. ఇది నాకు మరింత ఆనందాన్నిస్తోంది. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి ప్రజల కరెంటు బిల్లులను తగ్గించడమే కాకుండా, ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మారుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘దేశంలో 1 కోటి ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్‌లను ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను ప్రారంభించనుంది’ అని ప్రధాని మోదీ పోస్టు చేశారు.