ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో పాకిస్థాన్ అల్లాడిపోతోంది. ఆ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు కనీసం నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. అటు.. పరిస్థితిని చక్కదిద్దేందుకు పాక్ ప్రభుత్వం చేస్తున్న చర్యలేవీ ఫలించడం లేదు. ప్రపంచ దేశాలు, సంస్థల వద్ద అప్పుల కోసం పాక్ అడుక్కుతింటోంది. మరోవైపు.. త్వరలోనే పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పాక్ ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను తిరిగి గాడిలో పెట్టడం కష్టమేనని వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 8 వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పాక్ ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతంగా కొనసాగిస్తున్నాయి. అయితే
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన తాజా ఎన్నికల ప్రచారంలో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ దేశ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారు. పాకిస్థాన్ చాలా వెనకపడిపోయిందని.. పాకిస్థాన్‌ను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి.. ఉపాధి అవకాశాలను కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే తాను గతంలో ప్రధానిగా ఉన్న సమయంలో పాకిస్థానీ రూపీ విలువ పడిపోకుండా చూసినట్లు గుర్తు చేశారు. తమ హయాంలో డాలర్‌తో పాకిస్థానీ రూపీ మారకం విలువ 104 దాటకుండా చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశించి నవాజ్ షరీఫ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే పాక్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం నాశనం అయిపోందని.. దాన్ని తిరిగి గాడిలో పెట్టడం అంత సులభం కాదని పేర్కొన్నారు.
గతంలో కూడా పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి గురించి నవాజ్ షరీఫ్ తీవ్ర విమర్శలు చేసిన సంఘటనలు ఉన్నాయి. పాకిస్థాన్‌కు పొరుగున ఉన్న దేశాలు చంద్రుడిపై కాలుమోపాయని.. కానీ పాక్ మాత్రం భూమి మీదే ఎదగలేకపోతోందని.. భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 విజయం సందర్భంగా పరోక్షంగా తెలిపారు. ఇక పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కష్టాలకు కారణం తమ దేశస్థులేనని వ్యాఖ్యానించారు. భారత్, అమెరికా వల్ల పాక్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోలేదని.. 2018 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలోకి రావడమే కారణం అని పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడటమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దిగజారిపోయిందని విమర్శలు చేశారు.