అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభోత్సం సోమవారం అట్టహాసంగా జరిగింది. తొలి రోజు కేవలం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించిన అతిథులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించారు. ఇక నేటి నుంచి సాధారణ భక్తులకు బాల రాముడిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో అయోధ్య రాముడిని చూసేందుకు భక్తులు క్యూ కట్టారు. దీంతో అయోధ్య రామాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆ బాల రాముడిని చూసేందుకు ఒకరిని ఒకరు తోసుకోవడంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. దర్శనాలు ప్రారంభమైన రోజే బాల రాముడిని దర్శించుకోవాలనే ఆశతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు.
తీవ్రమైన చలి ఉన్నప్పటికీ తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆలయ పరిసరాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 7 గంటలకు దర్శనాలు ప్రారంభమైనా అంతకంటే ముందే వచ్చి అక్కడ వేచి చూశారు. దీంతో ఆలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వారిని అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరికీ అయోధ్య రాముడి దర్శనం అవుతుందని.. భక్తులు సంయమనం పాటించాలని ఆలయ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం రోజులో 2 విడతల్లో అయోధ్యలో బాల రాముడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు తొలి దశ దర్శనం ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు.. బాల రాముడిని దర్శించుకోవచ్చని తెలిపింది. ఈ క్రమంలోనే భక్తుల రద్దీ భారీగా పెరిగితే స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని ఆలయ ట్రస్ట్ యోచిస్తోంది.
ఇక ప్రతీ రోజు మధ్యాహ్నం అయోధ్య బాల రామునికి బోగ్ అందించనున్నారు. అలాగే ప్రతి గంటకు పాలు, పండ్లు అందిస్తారు. మరోవైపు.. రామ్ లల్లాకు వారంలో రోజుకో రకమైన వస్త్రాలను ధరింపజేయనున్నట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీమ్, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు దుస్తులను కట్టించనున్నట్లు పేర్కొన్నారు. ఇక ప్రత్యేకమైన రోజుల్లో బాల రాముడికి పసుపు రంగు దుస్తులు ధరింపజేయనున్నట్లు చెప్పారు. ఇక రామ్‌లల్లాకు రోజులో 6 సార్లు హారతి నిర్వహించనున్నారు. దీనికి హాజరయ్యేందుకు భక్తులకు ఉచితంగా పాస్‌లు జారీ చేస్తారు. ఇప్పటి వరకు రామ్‌లల్లాకు రోజుకు 2 హారతులు మాత్రమే ఉండేవి. ఇకపై రోజుకు 6 హారతులు ఉంటాయని ఆచార్య మిథిలేష్ నందిని శరణ్ తెలిపారు.