టీడీపీ సీనియర్ నేత, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు మంగళవారం అసెంబ్లీ స్పీకర్ ఆమోదం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు మద్దతుగా రెండేళ్ల క్రితం గంట శ్రీనివాసరావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో టీడీపీ అప్రమత్తం అయింది. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల నాటికి.. తమ సంఖ్యా బలం తగ్గించేలా వైసీపీ కుట్ర పన్నుతోందని టీడీపీ నేతలు అంటున్నారు.