ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను కూడా విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్‌కు కూడా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్‌లో జరగబోతున్నాయా? అనే చర్చ జరుగుతోంది. ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటించి వెళ్లిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల తేదీ ఫిక్స్ చేశారా?.. అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఏప్రిల్ 16వ తేదీన ఏపీలో ఎన్నికలంటూ ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి ఎన్నికల అధికారి లేఖ ఒకటి వైరల్ అవుతోంది. ఏపీలో అసెంబ్లీకి ఏప్రిల్ 16వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని రిఫరెన్స్ డేట్‌గా ఈసీ పెట్టుకున్నట్లు ఆ లేఖలో ఉంది. ఈ మేరకు రాష్ట్రాలను కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం చేస్తోందనే ప్రచారం జరిగింది. లోక్ సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు చేస్తోందని చర్చ నడుస్తోంది.
ఏప్రిల్ 16న ఎన్నిక తేదీగా భావించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. లోక్‌సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఈసీ భావిస్తోందనేది ఆ లేఖ సారాంశం. అయితే ఎన్నికల సంసిద్ధత కోసం ఆ తేదీ ఇచ్చినట్లు ఢిల్లీ సీఈవో మరో లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీ సీఈవో.. కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఢిల్లీ సీఈవో వివరణను ట్వీట్టర్‌లో రీపోస్ట్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏప్రిల్ 16 వ తేదీ లోక్ సభ ఎన్నికల ప్లానింగ్ కోసం మాత్రమే అంటున్నారు. అది కేవలం ఊహాజనిత పోలింగ్ డేట్ మాత్రమేనని.. నిజమైన ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుందన్నారు. అన్ని రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాన్ని సిద్ధం చేసేందుకే ఊహాజనిత పోలింగ్ తేదీలు మాత్రమే అంటున్నారు. దీంతో ఈ రూమర్స్‌కు చెక్ పడింది.