ఏపీలో మరో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగం పూర్తయ్యింది. వెలిగొండ ప్రాజెక్ట్ కల సాకారం చేస్తూ.. రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయని మేఘా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పెద్దదోర్నాల మండలంలో చేపట్టిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణంలో.. మొదటి సొరంగం తవ్వకం పనులు గతంలో పూర్తవ్వగా.. రెండోది కూడా ఇప్పుడు పూర్తయ్యింది. 2019, మే 30 నాటికి మిగిలిపోయిన 7.698 కిలోమీటర్ల తవ్వకం పనులు మంగళవారం పూర్తి చేసినట్టు ఇంజీనీర్లు ప్రకటించారు. ఇక, మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేయగా.. రెండో టన్నెల్ పనులు ముగిం పూర్తి కావడంతో.. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ఘనత దక్కింది.
శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీటిని తరలించడానికి ఫీడర్ ఛానల్ ఇప్పటికే పూర్తి చేశారు.. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్ రిజర్వాయర్.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పూర్తి చేశారు.. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరగానే నల్లమల సాగర్‌కు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని దాదాపు 4.47 లక్షల ఎకరాలు సాగునీటిని అందించొచ్చు. మూడు జిల్లాల పరిధిలోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగంలోని కొల్లం వాగు వరకు రెండు టన్నెల్స్ తవ్వకం పనులు పూర్తి చేశారు.
ఈ రెండు సొరంగాలను ఫిబ్రవరి మొదటి వారంలో జాతికి అంకితం చేయనున్నారు. దీంతో వచ్చే సీజన్‌లో శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే.. వెలిగొండ రెండు సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు తరలించడానికి రంగం సిద్ధంచేశారు. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీల పొడవున తవ్విన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం. ఇక ఈ ప్రాజెక్టు అంతా నీలం సంజీవరెడ్డి పులుల అభయారణ్యం పరిధిలో ఉండడంతో వన్య ప్రాణులకు సైతం ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని నిర్మాణ సంస్థ మేనేజర్ పి.రాంబాబు తెలిపారు. అలాగే, కరోనా సమయంలో కూడా ప్రభుత్వ సహకారంతో పనులు చేపట్టామన్నారు. వచ్చే సీజన్లో నీటిని ఈ సొరంగాల ద్వారా విడుదల చేస్తామని చెప్పారు.