ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు జనసేన పార్టీ శ్రేణులకు గుడ్ న్యూస్ ఇది. జనసేనకు గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఇ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల కాపీలను పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్ బుధవారం (జనవరి 24) పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కి అందచేశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, కిందటిసారి సార్వత్రిక ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారు. అయితే, జనసేన పార్టీకి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం గతేడాది ‘గాజు’ గ్లాసును ఫ్రీ సింబల్‌గా ప్రకటించింది. తాజాగా జనసేన విజ్ఞప్తితో తిరిగి గాజు గ్లాసును పార్టీ సింబల్‌గా కేటాయించారు. ఈ నిర్ణయం పట్ల జనసేన నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.