ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. ఆ 8మంది ఎమ్మెల్యేలకు నోటీసులు, చర్యల సంగతేంటి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 24, 2024, 10:27 PM

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించారు. అక్కడితో ఆగకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు అనర్హత వేటు వేయాలని 8 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు. రాతపూర్వక స్పందన కోసం ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. అయితే దానికి వారు స్పందించారా? లేదా.. తదుపరి చర్యలు ఏం తీసుకోబుతున్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.


గతేడాది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటు వేశారని.. తర్వాత కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేయాలంటూ వైఎస్సార్‌సీపీ ఈ నెల 8న స్పీకర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత.. వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిధర్‌, వాసుపల్లి గణేష్‌ 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికై అనంతరం వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలపడంతో.. ఇప్పుడు ఆ పార్టీ తరఫునే పనిచేస్తున్నారని, వారిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.


వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇవ్వగా.. తమకు సమయం కావాలని నలుగురు ఎమ్మెల్యేలు కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెల 26వ తేదీ వరకు సమయం ఇస్తూ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం లేఖ రాసింది. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీకి మద్దతిస్తూ వారి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారన్న ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ అధికారులు కోరారు.


మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన శాసనసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను స్పీకర్‌ తమ్మినేని సీతారాం దాదాపు మూడేళ్ల తర్వాత ఆమోదించారు. ఈ మేరకు శాసనసభ సెక్రటేరియేట్‌ మంగళవారం గెజిట్‌ విడుదల చేసింది. గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ 2021 ఏప్రిల్‌ 12న స్పీకర్‌కు లేఖ పంపించారు. దానిని ఆమోదించాల్సిందిగా మూడు నాలుగు సార్లు స్పీకర్‌కు ఫోన్‌లో విజ్ఞప్తి చేశారు. మరోసారి ఆమదాలవలసలోని స్పీకర్‌ ఇంటికి వెళ్లి మరీ రాజీనామా ఆమోదించాల్సిందిగా కోరారు. కానీ స్పీకర్‌ పట్టించుకోలేదు. ఇన్నేళ్ల తర్వాత కొన్ని వారాల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశముందని అందరూ భావిస్తున్న సమయంలో హఠాత్తుగా స్పీకర్‌కు గంటా రాజీనామాను ఆమోదించారు.


త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా గంటా శ్రీనివాసరావు రాజీనామాకు ఆమోదం తెలిపారని టీడీపీ ఆరోపిస్తోంది. సాంకేతికంగా తగిన సంఖ్యాబలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని పోటీకి నిలపాలని టీడీపీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందుకే గంటా రాజీనామాను ఆమోదించడం ద్వారా టీడీపీకి ఒక ఓటు తగ్గించేలా.. హడావుడిగా స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని టీడీపీ అంటోంది. అంతేకాదు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైఎస్సార్‌సీపీ టికెట్లు నిరాకరించింది.. దీంతో వారు వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేస్తారేమోనన్న భయంతో ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. గతేడాది జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం సాధించారు. పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలు నలుగురు ఆమెకు ఓటు వేయడం వల్లే గెలిచారని.. నలుగుర్ని వైఎస్సార్‌‌సీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్లాన్ చేస్తున్నారన్నారు.


మూడేళ్ల క్రితం తాను రాజీనామా చేస్తే, మూడు నెలల్లో ఎన్నికలుండగా ఇప్పుడు ఆమోదించడమేంటని గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో జగన్‌ ఎంత పిరికివాడో అర్థమవుతోందని.. జగన్‌లో రాజ్యసభ ఎన్నికల భయం కనిపిస్తోందని, 50 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేస్తారని సీఎంకు అనుమానంగా ఉన్నట్టుందన్నారు. తన రాజీనామాను ఆమోదించే ముందు కనీసం తనను సంప్రదించాలన్న కనీస విలువలూ పాటించలేదన్నారు. గతంలో తాను స్పీకర్‌ను కలిసి అడిగినా ఆమోదించకుండా.. ఇప్పుడు ఆమోదించడమేంటి? అని ప్రశ్నించారు.రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉన్న మార్గాలపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa