బోయింగ్ విమానాల్లో లోపాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ మరో ప్రమాదం చోటు చేసుకుంది. బోయింగ్ 757 విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా వీల్ ఊడిపోయింది. అమెరికాలోని అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం (జనవరి 20) చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అట్లాంటాలోని హార్ట్స్‌ఫీల్డ్ - జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం టేకాఫ్ అవుతుండగా.. నోస్ వీల్ ఊడిపోయిందని ‘ది హిల్’ ఒక వార్తా కథనంలో పేర్కొంది. బోయింగ్ 757 విమానం కొలంబియాలోని బొగోటాకు వెళ్లేందుకు ఉదయం 11 గంటల తర్వాత టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటన తర్వాత ప్రయాణీకులందరినీ విమానంలో నుంచి దింపేసి, విమానాన్ని తిరిగి టెర్మినల్‌కు తరలించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. నోస్ గేర్ టైర్ ల్యాండింగ్ గేర్ నుంచి వదులై, ఊడి వచ్చిందని తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి డెల్టా ఎయిర్‌లైన్స్ కంపెనీ క్షమాపణలు చెప్పింది. ఈ నెల 5న అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం గాల్లోకి ఎగరగానే డోర్ ఊడిపడిపోయింది. డోర్ లేకుండానే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన తర్వాత ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ విమానాలలో భద్రతపై తనిఖీ చేపట్టింది.
ఈ ఘటన తర్వాత అమెరికా విమానయాన సంస్థలు డజన్ల కొద్దీ విమానాలను నిలిపివేశాయి. వేలాది మంది ప్రయాణికులు తమ ఫ్లైట్‌లను రద్దు చేసుకున్నారు. ప్రయాణికుల భద్రతే తమ తొలి ప్రాధాన్యం అని ఎఫ్‌ఏఏ స్పష్టం చేసింది. బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలు సురక్షితమని ఎఫ్ఏఏ సంతృప్తి చెందే వరకు అనుమతివ్వబోమని ప్రకటన చేసింది. ఈ చర్యతో అమెరికాలోని విమాన రవాణాపై తీవ్ర ప్రభావం కనిపించింది. అలస్కా ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్‌లను అన్ని దేశాలు పక్కన పెట్టేశాయి. ఇదిలా ఉండగానే.. ఆ సంస్థకు చెందిన ఇతర విమానాల్లో లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. జనవరి 13న జపాన్‌లో ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు ఏర్పడ్డాయి. పైలట్లు ఈ విషయాన్ని గుర్తించి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
గతేడాది డెల్టా బోయింగ్ 737 విమానం అట్లాంటా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఎడమ ప్రధాన గేర్ టైర్లు ఊడిపోయి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో 190 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరినీ అత్యవసర స్లైడ్‌లను ఉపయోగించి బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదం నుంచి ఒకరిద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు మినహా.. అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అలస్కా విమాన ప్రమాదం తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది. ఎఫ్‌ఏఏ ఇప్పటివరకూ 171 బోయింగ్ 737 మాక్స్ 9 విమానాలను తనిఖీ చేసినట్లు తెలిపింది. భారత్‌లోనూ డీజీసీఏ ఈ విమానాలపై దృష్టి పెట్టింది. దేశంలో ఈ రకం విమానాలు మొత్తం 40 ఉన్నాయి. వీటిని ఆకాశ ఎయిర్ 22, స్పైస్ జెట్ 9, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 9 విమానాలను నడుపుతున్నాయి.