నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఉచిత ఇంటిస్థలాల రిజిస్ట్రేషన్ల కోసం గ్రామవార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఉచిత ఇంటిస్థలాల రిజిస్ట్రేషన్ కోసం గ్రామవార్డు సచివాలయాలు ఇక నుంచి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మారతాయి. జగనన్న శాశ్వత స్థలాల హక్కు పథకం కింద సెంటు భూమి ఇళ్లపట్టాలను రిజిస్ట్రేషన్ చేసేందుకు గానూ గ్రామవార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా ప్రభుత్వం మార్పు చేసింది. వాటి పరిధిలోని లబ్దిదారులు సమీపంలోని గ్రామవార్డు సచివాలయాల్లోనే పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించుకునేలా నోటిఫికేషన్ ఇచ్చింది. సచివాలయాల్లోని పంచాయితీ కార్యదర్శులు వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం రెండు వేర్వేరు నోటిఫికేషన్‌లు ఇచ్చింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ సిఫార్సుల మేరకు ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్టు సమాచారం. ఈ నోటిఫికేషన్ తక్షణం అమల్లోకి వస్తుందని.. ఉచిత ఇంటిస్థలాల రిజిస్ట్రేషన్ల వరకూ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.