వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ పూర్తిచేశామని అసత్య ప్రచారం చేయడం దారుణమని, ఇలాంటి ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టొద్దని టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, మత్తుముల అశోక్‌రెడ్డి, వైపాలెం టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు ధ్వజమెత్తారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తిచేసినట్లయితే టన్నెల్ వద్దకు అఖిలపక్ష నాయకులను తీసుకెళ్లి చూపించాలన్నారు. మొదటి టన్నెల్ పనులు పూర్తయిన వెంటనే నీరు ఎందుకు విడుదల చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. అసంపూర్తి పనులతో వెలిగొండ ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టు రెండో టన్నెల్ 9.2 మీటర్ల వ్యాసార్థంతో పనులు చేయాల్సి ఉండగా, కేవలం ఐదు మీటర్ల పనులను చేసి పూర్తయినట్లుగా అసత్య ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కేంద్ర జలశక్తి శాఖమంత్రి వద్దకు వెళ్లి వెలిగొండను గెజిట్‌లో చేర్చేలా కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం వెలిగొండ కాలువలు అసంపూర్తిగా ఉండటం వలన టన్నెల్ పరిసర ప్రాంత గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమ ప్రకాశం ప్రజలపై వైసీపీ నాయకులు వివక్ష చూపుతున్నారని టీడీపీ వై.పాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఈ ప్రాంత ప్రజలను మంత్రి సురేష్, సీఎం జగన్ మభ్యపెడుతూ మోసం చేస్తున్నారన్నారు. సమావేశంలో మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్‌మెంట్ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు మౌలాలి, నాయకులు కొప్పుల శ్రీనివాసులు, ఏఎంసీ మాజీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, సత్యనారాయణ పాల్గొన్నారు.