ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీలో జగన్ కీలుబొమ్మగా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు కానీ ఇక్కడ బీజేపీ రాజ్యం ఏలుతోందని వైఎస్ షర్మిల ఆరోపించారు. తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని, పార్టీని బీజేపీ వద్ద జగన్ తాకట్టు పెట్టాడని విరుచుకుపడ్డారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విసృతస్థాయి సమావేశంలో షర్మిల మాట్లాడారు. జగన్ అన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగ అని షర్మిల విరుచుకుపడ్డారు. వైఎస్సార్ పథకాలు ఒక్కటి రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. ఇది రైతు రాజ్యం కాదు, వైఎస్సార్ సుపరిపాలన అంతకన్నా కాదని షర్మిల స్పష్టం చేశారు. 30 వేల టీచర్ పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ వేయలేదని మండిపడ్డారు. వైఎస్సార్ ప్రజల మనిషి.. ప్రజల మధ్యే జీవించాడని షర్మిల గుర్తుచేశారు. జగన్ ఒక నియంత అని,పెద్ద కోటలు కట్టుకున్నాడని విమర్శించారు. ప్రజలకు కనపడరు, ఎమ్మెల్యేలను కలవరని విరుచుకుపడ్డారు. వైఎస్సార్ పాలనకు జగన్ అన్న పాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.