ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక తన మార్క్ చూపిస్తున్నారు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వ పాలనపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్‌పై ఏపీసీసీ చీఫ్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని విడగొట్టి రాజకీయాలు చేస్తోందంటూ బుధవారం సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగన్ అన్న. దేవుడే గుణపాఠం చెప్తారట. నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే కారణం జగనన్నే. ఇవాళ వైఎస్సార్ కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్నే. దీనికి సాక్ష్యం దేవుడు... దీనికి సాక్ష్యం నా తల్లి, వైఎస్సార్ భార్య విజయమ్మ. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందిలో ఉంటే 18 మంది రాజీనామాలు చేసి జగన్ అన్న వైపు నిలబడితే అధికారంలో వచ్చాక మంత్రులను చేస్తా అన్నారు. ఇవాళ వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ, నేను వాళ్ళ కోసం తిరిగాం. వాళ్ళ గెలుపు కోసం పాటు పడ్డాం. వాళ్ళను గెలిపించాం. వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు. నా ఇంటిని, పిల్లలకు పక్కన పెట్టి ఎండనకా, వాననకా రోడ్ల మీదనే ఉన్నా. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కాదా అని ఆ యాత్ర కూడా చేశా. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా. ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూడకుండా, నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా. గత ఎన్నికల్లో ‘బై బై బాబు‘ అంటూ ఊరూరా తిరిగా. దేశంలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్యాంపెయిన్ చేశా. మిమ్మల్ని గెలిపించా. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి వేరే మనిషిగా మారిపోయాడు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నాను. మంచి ముఖ్యమంత్రి అయితే చాలు.. వైఎస్సార్ పేరు, ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నా. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. అయినా ఏపీలో బీజేపీ రాజ్యం ఏలుతోంది. జగన్ ఆయన పార్టీని, రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు. ప్రత్యేక హోదా అడగకుండా బానిస అయ్యారు. 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా హోదా అడగలేదు. రాష్ట్రంలో ఇప్పుడు హోదా అన్న అంశమే లేదు అంటూ తనదైన శైలిలో జగన్‌పై షర్మిల విరుచుకుపడ్డారు.