తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మైనార్టీల నిధుల దుర్వినియోగంపై తప్పకుండా విచారణ జరిపిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గురువారం నాడు జనసేన కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రైస్తవ మత పెద్దలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ తన స్వార్థం కోసం మతాన్ని వాడుకుంటున్నారని.. జీసస్ చెప్పిన మాటలను పాటించడం లేదని మండిపడ్డారు. జీసస్ మాటలను పాటిస్తే జగన్ ఏపీని ఇబ్బందుల పాల్జేసేవాడు కాదని తెలిపారు. మైనార్టీల హక్కుల పరిరక్షణకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు. తన మతాన్ని ప్రేమించి... ఇతర మతాలను గౌరవించేవారే ప్రజలకు న్యాయం చేయగలరని అన్నారు. పాస్టర్లకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. తాను మతాల గురించి మాట్లాడే సందర్భంలో కొంత మందికి ఇబ్బంది కలగవచ్చని... అందుకు కారణం ఒక విధమైన అభద్రతా భావమని తెలిపారు. ఈ రాజకీయ నేతలు సెక్యూలరిజం అనే పదాన్ని ఓటు బ్యాంకుగా మలిచేశారని ధ్వజమెత్తారు. మైనార్టీలపై దాడి జరిగినప్పుడు మాత్రమే అందరూ మాట్లాడతారని పవన్ కళ్యాణ్ చెప్పారు.