ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. షర్మిల ఏదో ఆశించి జగన్ కోసం తిరిగారంటూ తనపై కొందరు వ్యాఖ్యలు చేశారని.. ఎవరూ కితాబు ఇవ్వకపోతే తన విలువ ఎక్కువ కాదు, తక్కువ కాదన్నారు. ఏపీసీసీ కార్యాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా షర్మిల జాతీయ జెండా ఎగురవేశారు. తాను వైఎస్ కూతురుని అయినప్పుడు వైఎస్ షర్మిల కాకుండా ఎలా ఉంటానని ప్రశ్నించారు. తన కొడుక్కి వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నానని.. తనకు చాలా దగ్గర మనిషి కొండా రాఘవ రెడ్డి కూడా తానే అడిగి మరీ పాదయాత్ర చేశానని మాట్లాడారని.. 'అన్నా కొండా అన్నా మీరు ప్రమాణం చేయగలరా.. మీ ఆరోపణలు నిజం కాదు అని నేను ప్రమాణం చేయగలను' అన్నారు.
అక్రమంగా సంపాదించుకోడానికి తన భర్తతో జగన్ వద్దకు వెళ్ళానని అభాండాలు వేస్తున్నారని.. తాను ఏమీ ఆశించి ఈరోజు వరకూ తన అన్న వద్దకు వెళ్ళలేదన్నారు. 'దీనికి సాక్ష్యం మా అమ్మే.. మీకు దమ్ముంటే మా అమ్మను అడగాలి'అన్నారు షర్మిల. నిజం ఎప్పుడు నిలకడగా నిలుస్తుందని.. వైఎస్సార్ ఆశయాల కోసమే తాను కాంగ్రెస్‌లో చేరానన్నారు.. తన దగ్గరి మనుషులు కూడా ఎన్నెన్నో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరంతా చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారన్నారు. తన పాదయాత్ర గురించి తప్పుగా మాట్లాడుతున్నారని.. భారతమ్మ చేయాలని అనుకున్న పాదయాత్ర తాను స్వార్థం కోసం చేశాననడం దారుణమన్నారు.
ఈ విషయాన్ని జైల్లో అధికారి చెప్పాడట.. దమ్ముంటే అప్పటి జైలు అధికారి తో ఈ విషయం చెప్పించ గలరా అని ప్రశ్నించారు. దేవుడు మీద ప్రమాణం చేయగలరా ? అని సవాల్ చేశారు. ఆ రోజు ఏం జరిగిందో తాను ప్రమాణం చేసి చెప్పగలనన్నారు. తనకు తానుగా ఎప్పుడు పాదయాత్ర చేయలేదని.. తనను అడిగితే తప్ప తాను పాదయాత్ర చేయలేదన్నారు. వైఎస్ జగన్ అధికారంలో వచ్చిన తర్వాత కేవలం ఒక్క సారి మాత్రమే విజయమ్మతో మాత్రమే వెళ్ళానన్నారు. తన భర్త అనిల్ ఒక్క రోజు కూడా జగన్‌ను కలవలేదన్నారు. తప్పుడు నిందలు వేయాలని చూస్తే పైన దేవుడు ఉన్నాడని.. జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలని నిస్వార్థంగా కోరుకున్నాన్నారు.
నియంతల్లా మారి కొందరు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. నియంతల్లా మారిన రీజనల్ పార్టీలు బడుగు బలహీన వర్గాలను సమానంగా చూడటం లేదన్నారు. ప్రభుత్వాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నాయని.. సమాజంలో సోషల్ జస్టిస్ వంద శాతం లేదన్నారు. రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి గుండు కొట్టి అవమానిస్తున్నారన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వమని ప్రజలు ప్రమాణం చేయాలన్నారు. అన్ని వర్గాల వారి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని.. భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి తీరదని చెప్పారు. రాష్ట్రంలో దళితులపై దాడులు వందశాతం పెరిగిపోయాయని.. దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసినవారిని పక్కన పెట్టుకుంటున్నారన్నారు. అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పడం కాదు.. ఆయన ఆశయాలను అమలు చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa