ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఎలక్షన్ హీట్.. జై భారత్ పార్టీ మేనిఫెస్టో విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 26, 2024, 07:42 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్తున్నాయి. అధికార వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అభ్యర్థుల వడబోత ప్రక్రియను చేపడుతున్నారు. టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగడం ఖాయం కాగా.. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపిణీ వ్యవహారం ఓ కొలిక్కి రావాల్సి ఉంది. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ తన జై భారత్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.


గత ఏడాది డిసెంబర్ 22న జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన లక్ష్మీనారాయణ.. నెల తిరిగే సరికి తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. దీనికి పీపుల్స్ మేనిఫెస్టో‌గా ఆయన నామకరణం చేశారు. అప్పు, అవినీతి, రౌడీయిజం, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని జై భారత్ పార్టీ ప్రకటించింది. ప్రతి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా మలుస్తామని హామీ ఇచ్చింది. ప్రతి ఒక్కరికి రూ. 10 లక్షల జీవిత బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చింది. విభజన సమయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిందని.. స్పెషల్ స్టేటస్‌‌తోపాటు విభజన హామీల సాధనే తమ ధ్యేయమని లక్ష్మీనారాయణ పార్టీ వెల్లడించింది.


రైతులకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని జై భారత్ పార్టీ హామీ ఇచ్చింది. స్వామి విశ్వనాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని.. రైతులకు వ్యవసాయ కూలీల ఖర్చు కోసం సంవత్సరానికి రూ.5000 ఇస్తామని, ఎఫ్‌పీవోలను ప్రోత్సహించడం ద్వారా తక్కువ ధరకు ధాన్యం, కూరగాయలు అందుబాటులో ఉండేలా చూస్తామని జై భారత్ పార్టీ హామీ ఇచ్చింది.


ఏటా జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామని జై భారత్ పార్టీ తెలిపింది. జనవరి 26న గ్రూప్-1, ఆగస్టు 15న గ్రూప్-2, సెప్టెంబర్ 5న డీఎస్సీ, అక్టోబర్ 31న ఎస్సై/కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని వెల్లడించింది. నాణ్యమైన రోడ్లను నిర్మిస్తామని.. రోడ్డు భద్రతా చట్టం అమలు చేయడంతోపాటు కొత్త విమానాశ్రయాలను నిర్మిస్తామని లక్ష్మీనారాయణ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. మహిళలు వద్దంటే మద్యం అమ్మకాలు ఉండవని స్పష్టం చేసింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఏడాదికి కోటి రూపాయల నిధులు మంజూరు చేస్తామని.. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని తెలిపింది.


నియోజకవర్గానికి నిమ్స్ స్థాయి హాస్పిటల్, జిల్లాకి ఎయిమ్స్ స్థాయి హాస్పిటల్‌ను నిర్మిస్తామని.. ప్రతి మండలంలో ప్రభుత్వ మెడికల్ స్టోర్ ఏర్పాటు చేస్తామని జై భారత్ పార్టీ హామీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పన్ను తగ్గిస్తామని.. ప్రతి ఇంటికి సబ్సిడీపై సోలార్ విద్యు్త్ అందించే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చింది. సొంతింటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక, కంకరను నిర్మాణ స్థలం వద్దకే సరఫరా చేస్తామని.. రైతులు పారిశ్రామికవేత్తలుగా మారడానికి భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చేయూతనిస్తామని తెలిపింది. ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయిస్తామని.. మొబైల్ పోలీస్ స్టేషన్లు, రూరల్ కోర్టులను ఏర్పాటు చేస్తామని జై భారత్ పార్టీ వెల్లడించింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com