టీడీపీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇచ్చామని.. వారిపై చర్యలు తీసుకోవాలని అధినేత చంద్రబాబు అసెంబ్లీ స్పీకర్‌ను కోరారు. వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిని అనర్హులుగా ప్రకటించాలని ఇప్పటికే పార్టీ విప్ డోలా బాలవీరాంజనేయస్వామి ఫిర్యాదు చేశారు. స్వామి ఇచ్చిన అనర్హత పిటిషన్‌పై శాసనసభ స్పీకర్.. టీడీపీ అధినేత అభిప్రాయం కోరారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని చంద్రబాబు స్పీకర్‌కు తెలియజేశారు.
ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ఏక వాక్య సమాధానం పంపారు. కొద్దిరోజుల క్రితం స్పీకర్ కార్యాలయం ఒక నోటీసును చంద్రబాబుకు పంపింది. విప్ ఇచ్చిన ఫిర్యాదుపై టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు తన వైఖరి తెలపాలని స్పీకర్ కోరారు. ఈ నోటీసుకు చంద్రబాబు గురువారం సమాధానం పంపారు. పార్టీ నిర్ణయం మేరకే అనర్హత పిటిషన్ ఇచ్చాం. ఆ మేరకు మీరు చర్యలు తీసుకోవాలన్నారు.
మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలనే దురుద్దేశంతో 2021 ఫిబ్రవరిలో ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను స్పీకర్ ఈ ఏడాది జనవరి 23న ఆమోదించారని పిటిషన్ దాఖలు చేశారు. రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌తో పాటు, తదనంతరం న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి ఈనెల 23న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటిస్తూ రద్దు చేయాలని ఆయన కోరారు.
స్పీకర్ ఆదేశాలు, గెజిట్ నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనేలా చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను ఆదేశించాలని కోరారు. న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ అసెంబ్లీ స్పీకర్, కేంద్ర ఎన్నికల కమిషనర్, ఏపీ చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్‌ను ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.