తిరుచానూరు పద్మావతి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 16న ఆలయంలో వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా పద్మావతి అమ్మవారు ఏడు వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. అంతకు ముందు వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 13న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
కార్యక్రమాల వివరాలు..
తిరుచానూరులో ఉదయం 7.15 గంటల నుండి 8.15 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8.45 నుండి 9.45 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10.15 నుండి 11.15 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11.45 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. మధ్యాహ్నం 1.15 నుండి 2.15 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు గజ వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
కాగా, సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఈసందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే లక్ష్మీపూజ, ఆర్జిత కల్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం, ఊంజలసేవ, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.