నకిలీ వెబ్‌సైట్లతో మోసపోవద్దంటున్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో నకిలీ వెబ్‌సైట్ల విషయంలో భక్తుల్ని అలర్ట్ చేశారు. శ్రీవారి భక్తులు నకిలీ వెబ్‌సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో టీటీడీ ఐటీ విభాగం క్షుణ్ణంగా పరిశీలించి 52 నకిలీ వెబ్‌సైట్లను, 13 నకిలీ మొబైల్ యాప్‌లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని భక్తులను కోరారు.
శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రిలో 26 నెలల్లో 2,350 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామన్నారు టీటీడీ ఈవో. రెండు రోజుల వయసు గల చంటిపాపకు కూడా గుండె ఆపరేషన్ చేయడం విశేషం. రాష్ట్రంలో తొలిసారిగా 11 గుండెమార్పిడి శస్త్రచికిత్సలు చేపట్టామన్నారు. కొత్త ఆసుపత్రిని శ్రీ పద్మావతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ పేరిట చిన్నపిల్లలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దనున్నామన్నారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో జనవరి 18వ తేదీన గుండె, లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను వైద్యులు ఏకకాలంలో విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం, సామనత్తం గ్రామానికి చెందిన గొల్లపల్లి హేమకుమార్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ కావడంతో అతని తల్లిదండ్రులు మానవతాదృక్పథంతో అవయవదానానికి ముందుకు వచ్చారన్నారు. ఈ సందర్భంగా స్విమ్స్ వైద్య బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.స్విమ్స్ ఆసుపత్రిలో అవయవ మార్పిడికి అవసరమైన అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. స్విమ్స్ అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.
టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాల, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలకు అటానమస్ హోదా లభించిందని ఈవో తెలిపారు. తద్వారా కళాశాలల అభివృద్ధికి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశంతో పాటు విద్యావిధానం, పరీక్షల నిర్వహణ, పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా సిలబస్‌లో మార్పులు చేసుకోవడం వీలవుతుంది. ప్రాంగణ ఎంపికలకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వస్తాయన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 18వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారు, నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు సప్త వాహనాలపై విహరించి భక్తులను కటాక్షించనున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 17 నుంచి 23వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు నిర్వహిస్తామన్నారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తారన్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.