ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు డే ఔట్, నైట్ ఔట్ భత్యాల (టీఏ) కింద రోజుకు రూ.150-400 చొప్పున ఈ నెల నుంచి అమలుచేసి.. మార్చి ఒకటో తేదీన ఇచ్చే జీతంలో కలిపేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల (ఈడీల) కమిటీ అంగీకరించినట్లు ఎన్‌ఎంయూఏ (నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్) తెలిపింది. ఈడీల కమిటీతో ఈ సంఘం నేతలు రెండు రోజులపాటు జరిపిన చర్చల్లో వివిధ సమస్యల పరిష్కారానికి అధికారులు అంగీకారం తెలిపినట్లు తెలియజేశారు. ఆర్టీసీలో చేరినప్పుడు ఉండే విద్యార్హతల ఆధారంగా ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (ఏఏఎస్) అమలు.. ఆర్టీసీ వైద్యుడితోపాటు ప్రభుత్వ వైద్యుడు ఇచ్చిన సిక్ లీవును కూడా పరిగణనలోకి తీసుకోవడానికి.. తగిన విద్యార్హతలు లేని డ్రైవర్లను టిమ్ సర్వీసుల్లో విధులకు పంపబోమని.. యూనిఫామ్, సీట్ వంటి అన్ని భత్యాలూ ఇచ్చేందుకు, అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టేందుకు ఈడీల కమిటీ అంగీకరించినట్లు ఎన్‌ఎంయూఏ తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.