ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొన్న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం, నేడు భారతరత్న

national |  Suryaa Desk  | Published : Sat, Feb 03, 2024, 10:18 PM

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కోట్లాది మంది హిందువులు వందల ఏళ్లుగా ఎదురుచూశారు. అయితే ప్రస్తుతం రామ జన్మభూమిలో బాలక్ రామ్ మందిర్ ఏర్పాటు అయింది. ఈ మందిర ఏర్పాటు కావడంతో కోట్లాది మంది కల నెరవేరింది. అయితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం వెనుక ఎంతో మంది ఏళ్లు, దశాబ్దాల కృషి, పోరాటం దాగి ఉంది. అందులో ప్రముఖమైన వ్యక్తి ఎల్‌కే అద్వానీ అని చెప్పుకోవచ్చు. ఇటీవలె అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని.. ప్రారంభోత్సవం జరుపుకుంది. దాంతో అద్వానీ దశాబ్దాల కల సాకారం అయింది. అయితే ఈ మహత్తర ఘట్టం జరిగిన కొన్ని రోజులకే ఆయనకు తాజాగా భారతరత్న అవార్డు వరించడంతో అద్వానీ ఆనందం రెట్టింపు అయింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం లాల్‌ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి చేసిన పోరాటం, కృషి ఎనలేనిది. అయోధ్యలో రాముడికి ఆలయం నిర్మించాలని ఏళ్ల పాటు సాగిన ఉద్యమానికి వీరిద్దరూ నాయకత్వం వహించారు. ఇక అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని అద్వానీ నేతృత్వంలో బీజేపీ ప్రారంభించిన రథయాత్ర.. మొత్తం ఉద్యమంలోనే కీలక ఘట్టంగా నిలిచింది. గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి అయోధ్యకు నిర్వహించిన రథయాత్ర.. దేశ ప్రజల్లో అయోధ్య రామ జన్మభూమిలో ఆలయం నిర్మించాలనే కోరికను పెంపొందించింది. అదే ఆ తర్వాతి ఉద్యమాలకు, న్యాయ పోరాటాలకు దిక్సూచిగా నిలిచింది.


ఇక అప్పటి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అద్వానీ చేసిన రథయాత్ర దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయోధ్యలో రామ మందిరం కోసం పోరాటం చేయాలని 1984 లో విశ్వహిందూ పరిషత్-వీహెచ్‌పీ నిర్ణయం తీసుకుంది. 1984 లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రామ మందిర పోరాటానికి అడుగులు పడ్డాయి. ఇక రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో షాబానో మనోవర్తి కేసుతో ఇది మరింత పెరిగింది. ముస్లింలను సంతృప్తి పరిచేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే సవాల్ చేస్తూ.. రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. దీంతో ఆ నిర్ణయం హిందువులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకువచ్చిన తన మనసును మార్చేసిందని ఎల్‌కే అద్వానీ.. తన జీవిత కథ అయిన 'మై కంట్రీ మై లైఫ్' పుస్తకంలో పేర్కొన్నారు. దీంతో 1986 లో రామ జన్మభూమి ఉద్యమం ఊపందుకుంది. ఇక 1989 నాటికి దేశ వ్యాప్తంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలనే ఆకాంక్షలను పెంచేలా చేసింది. ఈ క్రమంలోనే 1989 లో ఎన్నికల మేనిఫెస్టోలో అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని బీజేపీ చేర్చింది. దీంతో అప్పటివరకు 2 స్థానాలకే పరిమితమైన బీజేపీ.. ఆ తర్వాత 1989 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 85 సీట్లు దక్కించుకుంది. ఈ ఎన్నికల తర్వాత 1990 ఫిబ్రవరిలో వీహెచ్‌పీ కరసేవకు పిలుపునిచ్చారు. దీంతో అక్టోబర్ 30 వ తేదీన అయోధ్యలో వీహెచ్‌పీ తలపెట్టిన కరసేవ కార్యక్రమానికి బీజేపీ మద్దతు ప్రకటించింది.


ఈ నేపథ్యంలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం రథయాత్రను చేపట్టారు. 1990 సెప్టెంబర్ 12 వ తేదీన రథయాత్రపై బీజేపీ ప్రకటన చేసింది. సెప్టెంబర్ 25 వ తేదీన దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆరోజు గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు ఈ రథయాత్రను మొదలుపెట్టారు. అక్టోబర్ 30 వ తేదీ వరకు ఈ రథయాత్ర అయోధ్యకు చేరుకోవాలని రూట్ మ్యాప్ సిద్దం చేశారు. అయితే ఈ రథయాత్రను కేవలం ఉత్తర భారత దేశానికి మాత్రమే పరిమితం చేయకుండా.. దక్షిణాదిలో కూడా చేయాలని నిర్ణయించారు. 10 వేల కిలో మీటర్ల పాటు సాగే ఈ రథయాత్ర కోసం ఓ మినీ ట్రక్కును రథం రూపంలో సిద్ధం చేశారు. గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు మొదటి దశ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇక రెండో దశలో పశ్చిమ బెంగాల్ సరిహద్దులో బిహార్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకోవాలని నిర్ణయించారు. 1990 సెప్టెంబర్ 25 వ తేదిన సోమనాథ్‌లోని జ్యోతిర్లింగానికి పూజలు చేసిన తర్వాత అద్వానీ రథయాత్ర మొదలైంది. ఈ యాత్రలో అద్వానీతోపాటు మురళీ మనోహర్ జోషి.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. గుజరాత్‌లో 300 కిలోమీటర్ల పాటు సాగిన ఈ రథయాత్ర 600 పైగా గ్రామాల్లో కొనసాగింది. ఈ రథయాత్రలో అద్వానీ చేసే ప్రసంగం వినేందుకు ప్రజలు భారీగా తరలివచ్చేవారు. అప్పట్లో అద్వానీ రోజుకు 25 నుంచి 30 ప్రసంగాలు చేసేవారు. ఇక 1990 అక్టోబర్ 30 వ తేదీన బీజేపీ చేపట్టిన రథయాత్ర అయోధ్యకు చేరుకుంది. ఈ సమయంలోనే అయోధ్యలో అప్పుడు ఉన్న బాబ్రీ మసీదు ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లేందుకు కరసేవకులు ప్రయత్నించగా.. ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది చనిపోయారని అప్పటి యూపీ ప్రభుత్వం తెలిపినా.. నిజానికి అది ఎక్కువగానే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


ఈ ఘటన జరిగిన రెండేళ్లకు అయోధ్య రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంలో పెను సంచలనం చోటు చేసుకుంది. 1992 డిసెంబర్ 6 వ తేదీన మధ్యాహ్నం 1.55 గంటలకు.. దాదాపు 2 లక్షల మంది కరసేవకులు బాబ్రీ మసీదు వద్దకు చేరుకుని.. ఆ మసీదును కూల్చి వేశారు. అద్వానీ సహా మరికొంతమంది కీలక నేతలు.. మసీదుకు 200 మీటర్ల ఎత్తులో ఉన్న రామ్ కథా కుంజ్ వద్దకు చేరుకున్నారు. ఈ బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత యూపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మతపరమైన హింస చెలరేగింది. అయితే 27 ఏళ్ల తర్వాత.. అయోధ్యలో రామజన్మభూమి- బాబ్రీ మసీదుకు సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2019 నవంబర్ 9 వ తేదీన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు.. అయోధ్యలో వివాదాస్పదంగా ఉన్న భూమి హిందువులకే చెందుతుందని స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో రామ మందిరాన్ని నిర్మించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ముస్లింలకు అయోధ్యలో 5 ఎకరాల భూమి కేటాయించాలని.. ఆ స్థలంలో మసీదు నిర్మించుకోవాలని సూచించింది.


అయితే ఈ తీర్పు వచ్చిన దాదాపు ఒక ఏడాది తర్వాత 2020 సెప్టెంబర్‌లో.. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి.. అద్వానీ సహా మరో 31 మందిపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బాబ్రీ మసీదును కూల్చేందుకు కరసేవకులు ప్రయత్నాలు చేస్తుంటే.. అద్వానీ సహా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 31 మంది వారిని ఆపడానికి ప్రయత్నించారని కోర్టు గుర్తించి కేసును కొట్టివేసింది. ఈ క్రమలోనే అయోధ్యలో దివ్య రామ మందిరం నిర్మాణం చేసుకుని.. ఈ ఏడాది జనవరి 22 వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ జరుపుకుంది. దీంతో దశాబ్దాలుగా ఎల్‌కే అద్వానీ కలలు కన్న అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాకారం అయింది. ఇది జరిగిన రెండు వారాల్లోపే తాజాగా అద్వానీకి భారతరత్న రావడం మరో విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com