వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తే గ్రామాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన విపత్తుల నిర్వహణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖ, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిచౌంగ్ తుఫాన్‌తో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇతర పరిహారానికి నిధులు ఈ నెలలో విడుదలవుతాయని కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు త్వరలోనే నిధులు కేటాయిస్తామన్నారు. వేసవిలో గ్రామాలు, పట్టణాల్లో తాగు నీటికి ఇబ్బంది లేకుండా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వాస్తవానికి సంక్రాంతిలోగా రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ కొన్ని అనివార్య కారణాలతో సాధ్యం కాలేదు.. ఈ నెలలో డబ్బుల్ని జమ చేస్తామంటోంది ప్రభుత్వం.