ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయూత నిధులు జమకానున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి పదిరోజుల పాటు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పథకం కింద వచ్చే మొత్తం జమకానున్నట్లు తెలిసింది. మరోవైపు దీనికి సంబంధించి ఫిబ్రవరి 8 నుంచి15 వరకూ అధికారులు ప్రత్యేక గ్రామ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశాల్లో వైఎస్ఆర్ చేయూత పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారు. అలాగే పథకం ద్వారా ఇప్పటికే లబ్ధిపొందినవారికి పథకం ద్వారా ఎలా ప్రయోజనం కలిగిందనేది వివరిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 16 నుంచి 25 వరకూ మండల కేంద్రాల్లో చేయూత చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారు.
మరోవైపు వైఎస్ఆర్ చేయూత పథకం నిధులు గతేడాది విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియలో కాస్త ఆలస్యం జరగ్గా.. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళకు ఏడాదికి 18వేల750 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. ఆదాయపన్ను పరిధిలోకి రాని, మూడు ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్టభూమికి మించని వారు ఈ పథకానికి అర్హులు. అయితే మూడేళ్లు విజయవంతంగా చేయూత పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం 4వ ఏడాది నిధులను ఈ నెలలోనే లబ్ధిదారులకు అందించనుంది. మరోవైపు గత మూడేళ్ల కాలంలో ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ.666.50 కోట్ల ప్రయోజనం లభించింది. గ్రామీణ ప్రాంతాల మహిళలకు రూ.478.49 కోట్లు, పట్టణ ప్రాంత మహిళలకు రూ.188.01 కోట్ల ప్రకారం లబ్ధి చేకూరింది. వైఎస్సార్ చేయూత కింద 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.50 లక్షల మందికి రూ.250 కోట్ల వరకు ఆర్థిక ప్రయోజనం లభించనుంది.