కర్నూలు జిల్లాలో మరోసారి భారీగా డబ్బులు, బంగారం, వెండి పట్టుబడింది. పోలీసులు కనిపెట్టకుండా కొత్తగా ప్లాన్ చేసినా.. అడ్డంగా దొరికిపోయారు. కృష్ణగిరి మండల పరిధిలోని 44నెంబరు జాతీయ రహదారిపై అమకతాడు టోల్‌ప్లాజా సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేటు స్లీపర్ బస్సులో తనిఖీ చేయగా.. నంద్యాలకు చెందిన అమర్ ప్రతాప్ దగ్గర రూ.1,20,80000 నగదు, తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన వెంకటేష్ రాహుల్ దగ్గర మూడు కిలోల 195 గ్రాముల బంగారం, రూ.19,23,500 నగదు, కోయంబత్తూరుకు చెందిన సెంథిల్‌కుమార్ దగ్గర రూ.44.50 లక్షల నగదు, 1కిలో 37 గ్రాముల బంగారం, సేలంకు చెందిన శబరిరాజన్ దగ్గర ఐదు కిలోల వెండి బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం నలుగురి దగ్గర ఎలాంటి పత్రాలు లేని రూ.4.59 కోట్లు విలువ చేసే బంగారు, వెండి, నగదు ఉన్నట్లు గుర్తించామన్నారు. వాటిని కృష్ణగిరి రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. వీరు సినీ ఫక్కీలో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. ముందుగానే ప్లాన్ ప్రకారం తమ ఒంటిపై ధరించిన బనియన్‌కు పెద్ద జేబులు ఏర్పాటు చేసుకుని వాటిలో బంగారం, వెండి, నగదు పెట్టుకుని, దానిపై చొక్కా వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. గత నెల 26న రాత్రి ఇదే టోల్‌ప్లాజా దగ్గర హైదరాబాద్ నుంచి అనంతపురానికి వెళుతున్న ట్రావెల్స్ బస్సులో కూడా ఓ వ్యక్తి నుంచి రూ.43.20లక్షలు స్వాదీనం చేసుకున్నారు.