ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో ధార్మిక సదస్సు ,,,,హాజరైన మఠాధిపతులు, పీఠాధిపతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 03, 2024, 08:48 PM

తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు వైభవంగా ప్రారంభమైంది. మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్టు టీటీడీ పాలకమండి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. భారతదేశం పవిత్రభూమి అని, ఇక్కడే వేదాలు ఆవిర్భవించాయని, సాక్షాత్తు విష్ణుమూర్తి వారు శ్రీరామ, శ్రీకృష్ణ రూపాల్లో అవతరించారని చెప్పారు. ఈ దేశంలోనే ధర్మాచరణకు దిక్సూచిగా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా అవతరించారన్నారు.


 స్వామివారి ఆశీస్సులతో అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా పీఠాధిపతులు, స్వామీజీలు, భావసారూప్యం గల ఇతర హిందూ మత సంస్థల నిర్వాహకుల నుండి సముచితమైన సూచనలను, సలహాలను స్వీకరిస్తామన్నారు. తాను తొలిసారి ఛైర్మన్ గా ఉన్న సమయంలో రెండు సార్లు ధార్మిక సదస్సులు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు, సలహాలను స్వీకరించి దళిత గోవిందం, మత్స్య గోవిందం, గిరిజన గోవిందం లాంటి కార్యక్రమాల ద్వారా భగవంతుడిని భక్తుల చెంతకు తీసుకెళ్లామన్నారు.


స్వామివారికి సంకీర్తనల సేవ అందించిన శ్రీ అన్నమాచార్యులు, శ్రీ పురందరదాసు, శ్రీ కనకదాసు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేర్లతో ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వామీజీల సూచనలతోనే ఎస్వీబీసీ ఛానల్ ఏర్పాటు చేసి ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం ప్రారంభించామని గుర్తు చేశారు. వేద పరిరక్షణ కోసం వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామన్నారు. సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని చిత్త శుద్ధితో ప్రజలకు చేరువ చేస్తున్న టీటీడీపై అవాస్తవ విమర్శల దాడి జరుగుతోందని కరుణాకర్ రెడ్డి స్వామీజీలకు విన్నవించారు.


స్వామీజీల ఆశీస్సులతో, సలహాలు, సూచనలను శాసనంగా భావించి టీటీడీ ధర్మ ప్రచారానికి పునరంకితం అవుతుందని ఆయన స్వామీజీలకు విన్నవించారు. తమ వైపు నుంచి ఏవైనా పొరబాట్లు జరిగి ఉంటే తగిన సూచనలు, సలహాలు ఇస్తే వాటిని సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు సోమవారం ముగియనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరయ్యారు.


చాలా కాలం తర్వాత ధార్మిక సదస్సును నిర్వహిస్తున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డికి శుభాశీస్సులు తెలిపారు శుశ్రూసానంద మాతాజీ. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా టీటీడీ అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. అయినా ఇంకా ఏదో చేయాలన్న తపనతో మరింత లోతైన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా భూమన చాలా చక్కని మాటలతో, వినయ విధేయతలతో కోరడం వారి సంస్కారం, ఔనత్యానికి నిదర్శనం అన్నారు. అంతటి మహనీయుడు కనుకే రెండో సారి స్వామి సేవ చేసుకునే భాగ్యం దక్కిందన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించకుండా చెడిపోతున్నవారి బాగు కోసం ధార్మిక సదస్సులు ఇంకా కొనసాగాలన్నారు. హిందూ ధర్మం గురించి మంచి సందేశాలు ఇవ్వగలిగేలా ధార్మిక సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలను విస్తృతం చేయాలని.. బాల, బాలికలకు, యువతకు సనాతన ధర్మం గురించి తెలిపేలా టీటీడీ సహకారంతో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. టీటీడీ తలపెట్టే ధార్మిక కార్యక్రమాల్లో తామూ భాగస్వామ్యులం కావాలన్నదే అభిమతం అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com