దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసేందుకు దాని విధివిధానాలు రూపొందించేందుకు ఉత్తరాఖండ్‌లోని పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేసి.. తాజాగా సీఎం పుష్కర్ సింగ్ ధామీకి నివేదిక సమర్పించింది. అయితే ఈ నివేదికలో ఉన్న కొన్ని కీలక అంశాలు బయటికి వచ్చాయి.
జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ కమిటీ.. ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ముసాయిదాను శుక్రవారం.. సీఎం పుష్కర్ సింగ్ ధామీకి అందించింది. ముఖ్య సేవక్ సదన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ముసాయిదాను ముఖ్యమంత్రికి సమర్పించింది. ఇందులో పలు కీలక విషయాలు సంచలనంగా మారాయి. అయితే ఈ సమయంలో సీఎం పుష్కర్ సింగ్ ధామీ అధికారిక నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
అయితే అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండితేనే వివాహాలు చేయాలని ఈ ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాలో చేర్చినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతోపాటు పెళ్లి చేసుకుంటే తప్పనిసరిగా ఆ పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అందులో పేర్కొన్నారు. అయితే ఏదైనా కారణం చేత భార్యా భర్తలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటే సమాన కారణాల మీదే విడాకులు ఇవ్వాల్సి ఉంటుంది. భార్య, భర్తలు ఇద్దరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. మొదటి భార్య బతికి ఉండగా.. రెండో పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు. అంటే బహు భార్యత్వాన్ని నిషేధిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
పురుషుల లాగే మహిళలకు కూడా వారసత్వంలో సమాన హక్కులు ఉండేలా నిబంధనలు రూపొందించారు. ఇక సహ జీవనం చేస్తున్న వారు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలని తేల్చి చెప్పారు. సహ జీవనం కోసం సెల్ఫ్ డిక్లరేషన్ చేయించుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఈ ఉమ్మడి పౌరస్మృతి నుంచి షెడ్యూల్ తెగలకు మినహాయింపును ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే షెడ్యూల్ తెగలకు ఈ నిబంధనలు ఉండవని.. ప్రస్తుతం ఉన్న చట్టాలే అమలు అవుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ముసాయిదా సిద్ధమైన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనుంది. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు నాలుగు రోజుల పాటు ఈ ప్రత్యేక సమావేశాలు జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక ముసాయిదా అందిన నేపథ్యంలో శనివారం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి.. ఆ ముసాయిదాకు ఆమోదం కల్పించనున్నారు. అయితే ఈ ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా.. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ముందుకు ఫిబ్రవరి 6 వ తేదీన రానున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ ఉమ్మడి పౌరస్మృతి అమలు అయితే దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. అయితే స్వాతంత్య్రం రాకముందు నుంచే గోవాలో ఈ ఉమ్మడి పౌరస్మృతి అమలు అవుతోంది.