అయోధ్యలో మందిరం, మసీదు వివాదం ముగిసిపోయి రాముడికి ఆలయం కొలువుదీరింది. ఇక వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు చేసుకునేందుకు దాదాపు 37 ఏళ్ల తర్వాత కోర్టు అవకాశం కల్పించింది. అయితే ఈ రెండు ప్రాంతాలు ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఉండటం గమనార్హం. కొన్ని దశాబ్దాలుగా న్యాయ పరంగా, రాజకీయ పరంగా తీవ్ర వివాదంగా కొనసాగిన ఈ రెండు వివాదాలకు యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌కు లింక్ ఉంది. ములాయం సింగ్ యాదవ్ హయాంలోనే జ్ఞానవాపి మసీదులో హిందువులు చేస్తున్న పూజలకు బ్రేక్ పడింది. ఇక అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడంతో అప్పట్లో పెను సంచలనంగా మారింది. మరోవైపు.. అయోధ్యలో కరసేవకులపై కాల్పులు జరిపించిన సీఎంగా ములాయం సింగ్ యాదవ్ నిలిచారు.
ఇటీవలె అయోధ్యలో బాలక్ రామ్‌కు ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న నేలమాళిగలో పూజలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు హిందువులకు అనుమతినిచ్చింది. దీంతో 37 ఏళ్ల తర్వాత మళ్లీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో మళ్లీ హిందూ దేవతలకు పూజలు ప్రారంభం అయ్యాయి. ఇక అయోధ్య, జ్ఞానవాపి మసీదు వివాదాల వెనక ఒకరి పేరు మాత్రం వినిపిస్తోంది. ఆయనే ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత ములాయం సింగ్ యాదవ్. అసలు ఆయన పేరు ఎందుకు అంటే వివాదం?
1990 అక్టోబర్‌లో ఉత్తర్‌ప్రదేశ్ సీఎంగా ములాయం సింగ్ యాదవ్ ఉన్నపుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్-వీహెచ్‌పీ నేతలు కరసేవ నిర్వహించారు. అయితే వీహెచ్‌పీ చేస్తున్న కరసేవపై ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కరసేవకుల ప్రకటన నేపథ్యంలో అయోధ్యలో అప్పుడు ఉన్న బాబ్రీ మసీదు ప్రాంగణంలోకి ములాయం సింగ్ యాదవ్ సర్కార్ 28 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించింది. అయినా.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి కరసేవకులు బాబ్రీ మసీదు ప్రాంగణానికి చేరుకున్నారు. బాబ్రీ మసీదుపై కాషాయ జెండాలను ఎగురవేశారు. ఈ ఘటనలో యూపీ పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు చెప్పాయి. అయితే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు మీడియాకు వెల్లడించారు.
అయోధ్యలో కరసేవకుల ఘటన తర్వాత 1991లో ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఓడిపోయి.. బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ సీఎం అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాతి ఏడాది అంటే 1992 డిసెంబర్ 6 వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణించడంతో యూపీలోని కళ్యాణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న పీవీ నరసింహరావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు యూపీలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. ఆ తర్వాత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ మళ్లీ అధికారంలోకి వచ్చారు.
అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ములాయం సింగ్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలో జరిగిన ఘటన నేపథ్యంలో.. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో అప్పటివరకు హిందూ విగ్రహాలకు నిర్వహించిన పూజలను 1993 డిసెంబర్‌లో ములాయం ప్రభుత్వం నిలిపివేసింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యను కారణంగా చూపుతూ ఈ చర్యను ప్రభుత్వం సమర్థించుకుంది. ఎలాంటి న్యాయ ఉత్తర్వులు లేకుండానే ఉక్కు కంచెను నిర్మించిందని శైలేంద్ర వ్యాస్ కోర్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో అప్పటి నుంచి మూతపడిన ఆ వ్యాస్ కా తెహ్కానా.. ప్రస్తుతం వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలతో తెరుచుకుంది. వ్యాస్ కా తెహ్కానాలో 1993 వరకు హిందువులు పూజలు జరగ్గా.. సెల్లార్‌లో 200 ఏళ్లకు పైగా వ్యాస్ కుటుంబం పూజలు చేసింది. వారి కుటుంబం పేరు మీదుగానే ఆ సెల్లార్‌కు వ్యాస్ కా తెహ్కానా అనే పేరు వచ్చింది.
ఇక ఇటీవలె జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేకు సంబంధించిన నివేదిక బయటికి వచ్చింది. మసీదు కింద గతంలో భారీ హిందూ దేవాలయం ఉన్నట్లు సర్వేలో వెల్లడైందని హిందూ తరపున లాయర్ విష్ణు శంకర్ జైన్ వెల్లడించారు. 800 ఏళ్ల చరిత్ర ఉన్న హిందూ దేవాలయాన్ని కాలక్రమంలో అనేక యుద్ధాలు, విధ్వంసం తర్వాత పునర్నిర్మాణాలు చోటు చేసుకుందని పేర్కొన్నారు. మహారాజా జయచంద్ర తన పట్టాభిషేకం తర్వాత సుమారు క్రీస్తు శకం 1170-1189 లో ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అయితే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1669 లో కాశీ విశ్వేశ్వర్ ఆలయాన్ని ధ్వంసం చేసి.. ఆ శిథిలాల మీద ప్రస్తుతం ఉన్న జ్ఞానవాపి మసీదును నిర్మించినట్లు చెబుతున్నారు.