ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీస్‌ స్టేషన్‌లోనే రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే.. వ్యక్తిపై కాల్పులు.. మరో ఎమ్మెల్యేకు గాయాలు

national |  Suryaa Desk  | Published : Sat, Feb 03, 2024, 10:27 PM

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ గైక్వాడ్ తుపాకీతో రెచ్చిపోయారు. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోనే మరో పార్టీ నేతపై ఫైరింగ్ చేయడం పెను సంచలనంగా మారింది. అయితే ఆ వ్యక్తిపై ఎమ్మెల్యే కాల్పులు జరుపుతుండగా.. పోలీసులు కూడా అక్కడే ఉండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ సంఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. అయితే మహారాష్ట్రలో అధికార కూటమిలో ఉన్న షిండే వర్గం శివసేన పార్టీకి చెందిన వ్యక్తిపై.. బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే సంఘటనలో అక్కడే ఉన్న షిండే వర్గం శివసేన ఎమ్మెల్యేకు కూడా గాయాలు అయినట్లు తెలిపారు.


ఉల్లాస్ నగర్ హిల్ లైన్ పోలీస్ స్టేషన్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన పార్టీకి చెందిన నేత మహేశ్‌ గైక్వాడ్‌పై.. బీజేపీ ఎమ్మెల్యే గణేశ్‌ గైక్వాడ్‌ పోలీస్ స్టేషన్‌లోనే కాల్పులు జరిపారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. అయితే ఓ సీనియర్‌ పోలీస్ అధికారి ఎదుటే ఈ కాల్పులు జరగడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అయితే భూ వివాదంలో చోటు చేసుకున్న ఘర్షణలతోనే ఈ కాల్పులు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.


పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. చాలా కాలంగా ఒక భూ వివాదం కొనసాగుతోందని.. ఈ క్రమంలోనే ఆ వివాదానికి సంబంధించి మహేశ్ గైక్వాడ్, గణేశ్‌ గైక్వాడ్‌లతో పాటు వారికి మద్దతుగా ఉన్న చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఉల్లాస్ నగర్ హిల్ లైన్ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త తీవ్ర రూపం దాల్చడంతో అది కాల్పులకు తెరతీసినట్లు పోలీసులు వెల్లడించారు. మాటా మాటా పెరగడంతో మహేశ్‌ గైక్వాడ్‌పై.. బీజేపీ ఎమ్మెల్యే గణేశ్‌ గైక్వాడ్‌.. 4 రౌండ్ల కాల్పులు జరిపారు.


ఈ ఘటనలో షిండ్ వర్గం శివసేన ఎమ్మెల్యే అయిన రాహుల్‌ పాటిల్‌ కూడా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పుల ఘటనతో అప్రమత్తం అయిన పోలీసులు.. వెంటనే ఎమ్మెల్యే రాహుల్ పాటిల్, మహేశ్ గైక్వాడ్‌ను థానేలోని జూపిటర్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఈ కాల్పులకు పాల్పడ్డ ఎమ్మెల్యే గణేశ్‌ గైక్వాడ్‌ను అరెస్టు చేసి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మహేశ్ గైక్వాడ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కాస్త విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో శివసేన కార్యకర్తలు థానే లోని జూపిటర్ ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com